జనసేన కార్యకర్తలు, నాయకుల బాధకో అర్థం వుంది. చంద్రబాబునాయుడు కేవలం తన కులానికి మాత్రమే ఇచ్చుకున్నన్ని సీట్లు కూడా జనసేన మొత్తానికి ఇవ్వలేదనే ఆవేదన ఆ పార్టీ అభిమానుల్లో కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కులం పాత్ర… మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కాస్త ఎక్కువే. దీంతో ప్రతిదీ ఆ కోణంలోనే చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేనను పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కాపులు, బలిజలు, వాటి అనుబంధ కులాలకు చెందిన వారు ఇటీవల ప్రకటించిన సీట్లపై ఆసక్తికర పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు మొదటి విడత జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి 22, రెడ్లకు 17 సీట్లు ఇచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
ఇదే జనసేన శ్రేణుల ఆవేదనకు దారి తీసింది. నాలుగు శాతం ఓటు బ్యాంక్ ఉన్న కమ్మ వారికి, తన కులం కావడం వల్లే చంద్రబాబు ఏకంగా 22 సీట్లు ఇచ్చారని, రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం వుందని జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. కానీ తాము లేనిదే టీడీపీకి భవిష్యత్ లేదని చెప్పుకుంటూ, కేవలం 24 సీట్లకు ఒప్పుకోవడం ఏంటనే ప్రశ్న వారి నుంచి వచ్చింది.
తమతో పోల్చుకుంటే కమ్మ వారికి నాలుగో వంతు మాత్రమే ఓట్లు ఉన్నాయని జనసేనను మోసే సామాజిక వర్గం బాహాటంగా చెబుతోంది. అలాంటప్పుడు వాళ్లక అత్యధిక సీట్లు, తమకు తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటని నిలదీసే పరిస్థితి. ఇవన్నీ పవన్‌కల్యాణ్‌కు పట్టవా? అని జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా పొత్తు ధర్మమని నిలదీస్తున్నారు.