జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అంటే తమ్ముళ్ళు ఏమని చెబుతారు. తమ సీట్లోకి రావద్దు మిగిలిన సంగతి తమకు తెలియదు అని. ఇలా ఎవరికి వారు వద్దు అంటే ఎక్కడ నుంచి సర్దుబాటు చేస్తారు అన్నది ప్రశ్న. అందుకే టీడీపీ జనసేన అధినాయకత్వం కూర్చుని ఎంపిక చేసుకున్న సీట్లలో కొన్ని ఇస్తారు.
నాలుగు దశాబ్దాల పార్టీ గా టీడీపీ ఉంది. ఆ పార్టీకి ప్రతీ చోటా క్యాడర్ ఉంది. కంచుకోటలు ఉన్నాయి. ఆ సీట్లలోనే కొన్ని త్యాగం చేయాలి. కానీ కుదరదు అంటున్నారు తమ్ముళ్ళు. మా సీటు ముట్టుకోకు అంటున్నారు. ఇదే తరహాలో అంతటా ఉంది.
జనసేన భీమిలీ, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ఎలమంచిలి వీలైతే విశాఖ సౌత్ కోరుకుంటోంది. అంటే అరడజన్ సీట్లు అన్న మాట. ఉమ్మడి విశాఖలో పదిహేను సీట్లు ఉన్నాయి. అందులో ఆరు ఇవ్వమని వారు అడుగుతున్నారు. కనీసం నాలుగు అయినా ఇస్తే చాలు అన్నది వారి మనోగతం.
కానీ ఆ నాలుగు సీట్లు కూడా ఎక్కువ అన్నట్లుగా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. జనసేన ఓట్లు కావాలి. వారి క్యాడర్ మద్దతు కావాలి. సీట్ల వద్దకు వచ్చేసరికి మాత్రం బలాలు లెక్కలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. జిల్లాలో లిట్మస్ టెస్ట్ గా అనకాపల్లి సీటు ఉంది.
ఇక్కడ జనసేనకు సీటు ఇచ్చారు. లొల్లి చేస్తోంది టీడీపీ. ఈ లొల్లికి కాస్తా టీడీపీ పెద్దలు తలవొగ్గితే అపుడు మిగిలిన చోట్ల సీట్లు ఇచ్చినా ఇదే రకంగా స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. అంటే ఎక్కడ అయినా సీటు ఇవ్వకుండా చేస్తే ఎలా పొత్తు సాగుతుంది అన్నది జనసేన నేతల వాదన. టీడీపీ జనసేన పొత్తుల విషయంలో విశాల హృదయంతో ముందుకు సాగితేనే ఫలిస్తాయి.
బలవంతంగా చేసినా అన్యమనస్కంగా సర్దుబాటు చేసుకున్నా ఫలితాలు తేడా కొడతాయని అంటున్నారు. టీడీపీ ఎన్నో పొత్తులను చూసింది కానీ జనసేన పొత్తు వారికి కొత్త అనుభవం. జనసేన 2019లో కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ టీడీపీతో పొత్తు వారికి సరి కొత్త అనుభవం. అందుకే ఈ పొత్తు కధ ఎలా కంచికి చేరుతుంది అన్నది రెండు పార్టీల పెద్దలతో పాటు క్యాడర్ లోనూ సందేహం గానే ఉందిట.