ఎన్నికల వేళ ఎక్కడ లేని వరాలు టీడీపీ కుమ్మరిస్తోంది. ఆల్ ఫ్రీ అంటోంది. సరిగ్గా 2009 ఎన్నికల ముందు ఇదే జరిగింది. చంద్రబాబు ఆనాడే నగదు బదిలీ పధకం అని ప్రకటించారు. అలాగే అనేక ఉచితాలతో ఎన్నికల గోదాలోకి దిగిపోయారు. అవతల వైపు చూస్తే వైఎస్సార్ ఆల్ ఫ్రీ బాబు అని ఎద్దేవా చేశారు.
బాబులా తాను ఎక్కువ హామీలు ఇవ్వలేనని కూడా ఒప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే వైఎస్సార్ రెండోమారు గెలిచారు బాబు హామీలను జనం నమ్మలేదు, వరసగా రెండవ మారు ప్రతిపక్షంలోకి వచ్చారు. ఇపుడు కూడా బాబు అదే వ్యూహం అమలు చేస్తున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఏపీ అసెంబ్లీలో చెప్పినట్లుగా దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు అక్కడ గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీలు అన్నీ కలిపి కిచిడీ చేసి జనం మీదకు బాబు వదులుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.
ఆ హామీలనే సూపర్ సిక్స్ అంటున్నారు. ఇంకా భారీ హామీలు ఉన్నాయని చెబుతున్నారు. రా కదలిరా అంటూ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో చంద్రబాబు ఆర్టీసీ బస్సులలో ఉచితం అని హామీ ఇచ్చారు. ఈ పధకం తెలంగాణాలో కాంగ్రెస్ ని గద్దెనెక్కించింది. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఏడాదికి ఇరవై వేలు వంతున నగదు బదిలీ చేస్తామని బాబు చెబుతున్నారు.
బీసీ డిక్లరేషన్ అంటున్నారు. రైతులకు ఎన్నో పధకాలు పెట్టి రైతు రాజ్యం తెస్తామని అంటున్నారు. ఇలా చంద్రబాబు కాదేదీ ఉచితం అన్న తరహాలో హామీల మీద హామీలు ఇస్తున్నారు. వీటితో ఆయన అధికారంలోకి వస్తారా ఉచితాలకు జనం ఓటేస్తారా అంటే ఆలోచించాల్సిందే.
అన్నీ ఫ్రీ అన్నా జనాలు నమ్మరు, అలాగని కొన్ని అన్నా నమ్మరు. జనాలు నమ్మడానికి హామీలకు మధ్య ఏదో ఉంది. అది క్రెడిబిలిటీ అని వైసీపీ నేతలు అంటున్నారు. అది జగన్ కి ఉంది అంటున్నారు. బాబు కూడా ఈసారి అధికారంలోకి వస్తే చేసి చూపిస్తారు అని టీడీపీ నేతలు అంటున్నారు. అంతకు ముందు ఎందుకు చేయలేదు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇవన్నీ జనం బుర్రలలోనూ తిరుగుతున్న ప్రశ్నలే. ఎవరేమి అనుకుంటేనేమిటి హామీలు బాబు ఇస్తున్నారు. వాటి ఫలితాలు ఎన్నికల ఫలితాలలోనే తేలుస్తాయి.