విశాఖ జనసేనలో ఆ ఇద్దరు అన్నదమ్ముల హవా పెరిగింది అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వారి మాటే నెగ్గుతోంది అని ప్రచారం సాగుతోంది. దాంతో విశాఖ జనసేన కడు సుందరంగా తయారైంది అని సెటైర్లు పడుతున్నాయి.
జనసేనలో సుందరపు విజయకుమార్ చాలా కాలం క్రితమే చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయనకే సీటు ఖరారు అయింది. ఈ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. అయితే ఆయన సోదరుడు సుందరపు సతీష్ కుమార్ విషయమే ఇపుడు ఆసక్తికరంగా మారింది.
ఆయన పార్టీలో చేరింది మూడు నెలల క్రితం. ఆయనకు గాజువాక టికెట్ ఇస్తున్నారు అని ప్రచారం ఊపందుకుంది. ఆయనకే ఎందుకు ఆ టికెట్ అంటే ఆయన మెగా ఫ్యామిలీకి కావాల్సిన వారు అని అంటున్నారు. మెగా డాటర్ నిహారిక కొత్త సినిమా నిర్మాత ఆయనే అని అంటున్నారు.
ఆయన గంగవరం పోర్టు కాంట్రాక్టర్ గా ఉన్నారని, అర్ధబలం అంగబలం నిండుగా ఉన్నవారని అంటున్నారు. దాంతో పాటు బలమైన సామాజిక వర్గం నేపధ్యం ఉంది. ఇలా అన్నదమ్ములు ఇద్దరికీ రెండు టికెట్లు జనసేన ఇవ్వబోతోంది అన్నది టాక్ ఆఫ్ ది విశాఖ అవుతోంది.
పొత్తులో జనసేనకు దక్కేవే తక్కువ సీట్లు. ఆ సీట్లలో ఇలా ఫ్యామిలీ ప్యాకేజి ఇస్తే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారి సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయట. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిలో ఒకాయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారని అంటున్నారు.
మరో ఆయన పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా చేయాలని ఆశగా చూశారు. ఇంకొకాయన గాజువాక మీద ఎనలేని ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఒక మహిళా నాయకురాలు కూడా ఈసారి పొత్తులో సీటు దక్కితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టవచ్చు అని ఊహించారు అని అంటున్నారు.
పొత్తులో భాగంగా జనసేన విశాఖలో అరేడు సీట్లు కోరబోతోంది అని అంటున్నారు. అయితే టీడీపీ నాలుగు మించి ఇవ్వదు అని ప్రచారంలో ఉంది. ఆ నాలుగులో ఇద్దరు అన్నదమ్ములకే టికెట్లు పోతే ఇక పార్టీ కొమ్ము ఆది నుంచి కాసిన వారి సంగతేంటి అని అంటున్న వారు ఉన్నారు. ఈ నాలుగు సీట్లలో ఒక మహిళా నేతకు సీటు ఇవ్వరా అన్నది కూడా ప్రచారంలోకి వస్తోంది. ఇవన్నీ చూస్తున్న వారు జనసేన సుందరమే అంటున్నారు.