విశాఖలో ప్రస్తుతం పర్యటిస్తున్న జనసేన అధినేత నాలుగు అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. ఈ నాలుగు సీట్ల నుంచి జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అన్నది తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ జనసేనలోకి జంప్ చేసిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్‌ని భీమునిపట్నం ఇంచార్జిగా నియమించారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలీ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. అక్కడ బలమైన యాదవ సామాజిక వర్గం తోడుతో మరో బలమైన కాపుల అండతో వంశీ గెలుపు సులువు అవుతుంది అని పార్టీ భావిస్తోంది. ఈ సీటు కోసం టీడీపీ పోటీ పడింది. కానీ జనసేనలే వెళ్తోంది అని ఇంచార్జి ప్రకటనతో తెలుస్తోంది.
గాజువాక నుంచి సుందరపు సతీష్ ని ఇంచార్జిగా ప్రకటించారు. ఆయన డిసెంబర్ లో జనసేనలో చేరారు. ఆ వెంటనే ఆయనకు ఈ సీటుకు ఇంచార్జిని చేశారు. గాజువాకలో జనసేన టికెట్ కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే సతీష్‌కే జనసేన అధినాయకత్వం ఓకే చెబుతోందని అంటున్నారు.
పెందుర్తి సీతు పంచకర్ల రమేష్ బాబుకు ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు ఆయనకు అక్కడ నుంచి ఇంచార్జిగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ నుంచి పోటీ చేయడానికి టీడీపీ తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రయత్నం చేశారు. కానీ ఇపుడు ఈ సీటు జనసేనకు వెళ్తోంది అని క్లారిటీ వచ్చేసింది.
అంతా అనుకున్నట్లే ఎలమంచిలి సీటు సుందరపు విజయకుమార్ కి దక్కింది. ఆయనను ఇంచార్జిగా నియమించారు. కానీ ఎప్పటి నుంచో ఆయన అక్కడ ఆ బాధ్యతలలో ఉంటున్నారు. ఈ సీటు విషయంలో సైతం టీడీపీ తమకే ఇవ్వాలని కోరింది అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ సీట్లు ఉంటే తొలి విడతగా ఈ నాలుగు సీట్లకు ఇంచార్జులను పవన్ ప్రకటించడం అంటే ఈ సీట్లు ఆ పార్టీకే ఖరారు అయినట్లే అంటున్నారు. మరిన్ని సీట్ల కోసం జనసేన చూస్తోంది అని అంటున్నారు.
అందులో అనకాపల్లి, చోడవరం, విశాఖ నార్త్ అయినా లేక సౌత్ అయినా అని అంటున్నారు. ఇందులో కనీసంగా రెండు సీట్లు అయినా జనసేన తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది. అలా విశాఖ జిల్లా నుంచి అరడజన్ సీట్లలో అయినా జనసేన పోటీ చేయాలని ఆ పార్టీ గట్టి నిర్ణయం తీసుకుంది అంటున్నారు.