రాజకీయాలపై టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవల్ని గుర్తించి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించింది. జగన్‌తో అలీ వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలీ కుమార్తె పెళ్లికి జగన్ హాజరై ఆశీస్సులు అందించారు.
వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికారత యాత్రలో అలీ పాల్గొని, ప్రభుత్వ ఆశయాల్ని వివరించారు. సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై ఆయన పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో పర్యటిస్తున్న అలీని మీడియా పలకరించింది. రాబోయే ఎన్నికల్లో పోటీపై ప్రశ్నించగా, కీలక కామెంట్స్ చేశారు.
వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ, సమయం సరిపోలేదన్నారు. గుంటూరు, నంద్యాల, రాజమండ్రి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే, తాను సిద్ధమని ఆయన అన్నారు. రాప్తాడు సిద్ధం సభ చూశాక… వైసీపీ విజయం ఖాయమని అర్ధమైందని ఆయన అన్నారు.
జనసేనాని పవన్‌కల్యాణ్, అలీ సినీ పరిశ్రమలు మంచి స్నేహితులు. గత ఎన్నికల నుంచి వాళ్లిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. పవన్‌ను కాదని రాజకీయంగా వైఎస్ జగన్‌కు అలీ మద్దతు పలికారు. ఒకట్రెండు సందర్భాల్లో పవన్‌పై అలీ విమర్శలు కూడా చేశారు. ఎన్నికల సమయం కావడంతో పోటీపై ఆయన మనసులో మాట బయట పెట్టారు. సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.