వ‌సంత‌పై త‌గ్గేదే లే అంటున్న దేవినేని ఉమా

టీడీపీలో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న జాప్యం అవుతున్న క్ర‌మంలో కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకొస్తున్నాయి. టికెట్ ఆశావ‌హులు ఎవ‌రికి వారే అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించుకుంటున్నారు. టీడీపీలో బ‌హు నాయ‌క‌త్వం ఆ పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. తాజాగా కృష్ణా జిల్లా…

టీడీపీలో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న జాప్యం అవుతున్న క్ర‌మంలో కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకొస్తున్నాయి. టికెట్ ఆశావ‌హులు ఎవ‌రికి వారే అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించుకుంటున్నారు. టీడీపీలో బ‌హు నాయ‌క‌త్వం ఆ పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. తాజాగా కృష్ణా జిల్లా మైల‌వ‌రంలో వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ టీడీపీలో చిచ్చు ర‌గిల్చారు. త్వ‌ర‌లో ఆయ‌న టీడీపీలో చేర‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాక‌ను మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులైన ఆ ఇద్ద‌రు నాయ‌కులు ప‌ర‌స్ప‌రం బూతులు తిట్టుకున్నారు. దేవినేని ఉమా ఒక అడుగు ముందుకేసి కృష్ణ‌ప్ర‌సాద్‌తో పాటు ఆయ‌న తండ్రి , మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావును కూడా నోటికొచ్చిన‌ట్టు తిట్టిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ వైరం ప‌రిధి దాటి వ్య‌క్తిగ‌తంగా మారింది.

అందుకే వ‌సంత రాక‌ను దేవినేని అడ్డుకుంటున్నారు. ఒక‌వైపు మైల‌వ‌రం టికెట్ వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంటే, మ‌రోవైపు దేవినేని ఉమా తానే పోటీలో వుంటాన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ నెల 21న అన్న‌రావుపేట నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా ప్రారంభిస్తున్న‌ట్టు ఆయ‌న వ‌ర్గీయులు వెల్ల‌డించారు. దీంతో వ‌సంత, దేవినేని మ‌ధ్య పోరు ప‌తాక స్థాయికి చేరుకుంది.

ఇదిలా వుండ‌గా, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను పార్టీలో చేర్చుకున్న త‌ర్వాత టికెట్ విష‌య‌మై నిర్ణ‌యించాల‌ని టీడీపీ ఆలోచిస్తోంది. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని పెన‌మ‌లూరు పంపాల‌ని టీడీపీ భావిస్తున్న‌ట్టుగా స‌మాచారం. ఈ లోపే దేవినేని ఉమా ర‌చ్చ చేయ‌డానికే నిర్ణ‌యించుకున్నారు. టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి ఆయ‌న సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.