రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ముందుగా జాన్వి కపూర్ నే అనుకున్నారు. కానీ ఆమె దేవర వైపు మళ్లింది. ఆ తర్వాత రవీనా టాండన్ కూతురుతో పాటు, మరికొంతమందిని ఆడిషన్ చేశారు. కానీ చుట్టూతిరిగి ఈ ఆఫర్ తిరిగి జాన్వి కపూర్ నే వరించింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న సినిమాలో జాన్వి కపూర్ ను హీరోయిన్ గా లాక్ చేశారు. ఈ విషయాన్ని జాన్వి తండ్రి బోనీ కపూర్ స్వయంగా ప్రకటించారు.
“నా కూతురు ఎన్టీఆర్ తో ఆల్రెడీ దేవర సినిమా చేస్తోంది. సెట్స్ లో ప్రతి రోజూ ఆమె ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే ఆమె రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా బాగా చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వి చాలా తెలుగు సినిమాలు చూస్తోంది. త్వరలోనే సూర్య సరసన కూడా నటించబోతోంది. శ్రీదేవి చాలా భాషల్లో నటించింది. జాన్వి కూడా అలా చాలా భాషల్లో నటించాలని కోరుకుంటున్నాను.”
ఇలా రామ్ చరణ్ సినిమాలో జాన్వి కపూర్ చేయబోతోందనే విషయాన్ని బోనీ కపూర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆడిషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వస్తుంది.
ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలై, జోరుగా సాగుతున్నాయి. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు.