తన సొంత రాజకీయ పార్టీని తాకట్టు పెట్టడం, చిన్నా చితకా ఇతర రాజకీయ పార్టీలను ఏకంగా టోకుధరకు కొనుక్కుని తన ప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవడం.. చంద్రబాబుకు అలవాటే.
తెలంగాణ ఎన్నికల్లో తన సొంత పార్టీ తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టేశారు. పార్టీకి ఆ రాష్ట్రంలో సమాధి కట్టేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా.. కాంగ్రెస్ ప్రయోజనాలకోసం సాయం అందించారు. దానికి ప్రత్యుపకారంగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా షర్మిలను నియమింపజేసి.. ఆమె ద్వారా జగన్ మీద విమర్శల దాడి చేయిస్తూ.. ప్రత్యుపకారం పొందుతున్నారు. ఇలా పార్టీలతో క్విడ్ ప్రోకో మాత్రమే కాదు.. ఏకంగా చిన్న చితకా పార్టీలను టోకుగా కొనుక్కోవడం కూడా చంద్రబాబుకు తెలుసు.
ఫ్యాను గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తుతో పోటీచేసే కమెడియన్ కెఎ పాల్ కు కూడా చంద్రబాబునాయుడు మద్దతు ఉందనే సంగతి రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు జడ శ్రావణ్ కుమార్ అనే మాజీ న్యాయమూర్తి స్థాపించిన జైభీమ్ భారత్ పార్టీని కూడా టోకుగా కొనుక్కుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
దళితుడు, న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉన్న జడ శ్రావణ్ కుమార్.. ఈ పార్టీని స్థాపించారు. అయితే.. ఆయన అమరావతికి మద్దతు ఇస్తూ తెలుగుదేశం అనుకూల వైఖరితోనే ముందునుంచి ప్రవర్తిస్తున్నారు. ఒక దశలో ఆయన తెలుగుదేశంలో చేరి, ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నట్టు కూడా పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత.. చంద్రబాబు ఏ పన్నాగం పన్ని, ఆయనకు ఏం ఆఫర్లు ఇచ్చారో తెలియదు గానీ.. ఎన్నికల్లో తన పార్టీని సొంతంగా బరిలోకి దింపుతున్నారు.
ఇప్పటి దాకా ఆయన ప్రకటించిన అభ్యర్థిత్వాలను గమనిస్తే.. జగన్ ను బద్నాం చేయడానికి, ఆయన పార్టీకి అంతోఇంతో గండికొట్టడానికి తప్ప.. మరో లక్ష్యంతో ఆయన ఎన్నికల్లో దిగుతున్నట్టుగా లేదు.
ఎందుకంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు, స్వయంగా గొడ్డలితో వేటువేసినట్టు ఆరోపణలున్నప్పటికీ.. అప్రూవర్ గా మారిపోయి అందరినీ ఇరికించడానికి ప్రయత్నిస్తున్న దస్తగిరికి జైభీం భారత్ పార్టీ తరఫున పులివెందుల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాగే కోడికత్తి కేసులో నిందితుడు.. జగన్ తనను ఇన్నాళ్లు జైలునుంచి బయటకు రానివ్వకుండా వేధించారని పదేపదే ఆరోపణలు చేస్తూ వచ్చిన కోడికత్తి శ్రీనుకు అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చి బరిలో దింపుతున్నారు.
ఇలాంటి ఉదాహరణలు గమనిస్తే చాలు.. జగన్ ను బద్నాం చేయడానికి, చంద్రబాబు స్కెచ్ ప్రకారం, ఆయనకు అమ్ముడుపోయి జైభీం భారత్ పార్టీ పనిచేస్తున్న సంగతి అర్థమైపోతుందని ప్రజలు అనుకుంటున్నారు.