విశాఖ ఆడపడుచుకే మీ ఓటు!

వైసీపీ తరఫున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఎంపీ పార్టీ ఆఫీసుని కూడా ఆర్భాటంగా ప్రారంభించారు. పార్లమెంట్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు అంతా హాజరయ్యారు. ఈసారి…

వైసీపీ తరఫున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఎంపీ పార్టీ ఆఫీసుని కూడా ఆర్భాటంగా ప్రారంభించారు. పార్లమెంట్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు అంతా హాజరయ్యారు. ఈసారి పక్కా లోకల్ క్యాండిడేట్ నే గెలిపించాలని ప్రజలకు అప్పీల్ చేశారు.

విశాఖ ఆడపడుచు అన్న ట్యాగ్ లైన్ తో బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నారు. తన సొంత గడ్డ విశాఖ అని తన పుట్టిల్లు వైజాగ్ అని ఆమె చెబుతున్నారు. విశాఖ ప్రాంత వాసిగా స్థానికంగా ఉన్న సమస్యలు అన్నీ తనకు తెలుసు అని ఆమె అంటున్నారు.

తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి కులంతో పాటు స్థానికత కూడా ఉపయోగపడతాయని వైసీపీ భావిస్తోంది. అందుకే విశాఖ ఆడపడుచు అని జనాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది. విశాఖ ఎంపీ సీటు నుంచి రెండు వరసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకే ఉంది. టీడీపీ పుట్టాక గెలిచింది మూడు సార్లు మాత్రమే. అది కూడా వరసగా కాదు. కాంగ్రెస్ టీడీపీతో పోటీ చేసి 1989తో పాటు 1996, 1998లలో వరసగా గెలిచింది. అలాగే 2004, 2009లలో వరసగా గెలిచింది. ఇపుడు వైసీపీ ఆ రికార్డు ని సమం చేయబోతోంది అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

వైసీపీ 2019లో గెలిచింది 2024లో కూడా తమదే విజయం అని అంటున్నారు. ఈసారి టీడీపీ పొత్తు ఉన్నా విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీకి దిగుతోంది. ఆ పార్టీ చివరి సారిగా 1999లో గెలిచింది. అలా పాతికేళ్ల తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

విశాఖ రాజకీయ ముఖ చిత్రం 2019 నుంచి 2024 నాటికి మారిందని వైసీపీ అంటోంది. ఈ మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి మేయర్ పీఠం  దక్కించుకుందని, విశాఖలో ఆరవై మంది దాకా కార్పోరేటర్లు ఉన్నారని చెబుతోంది. సిటీలోని నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు కచ్చితంగా గెలుస్తామని ఆ బలంతో పాటు మరో మూడింట వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపు ఖాయమని దాంతో విశాఖ ఎంపీ సీటు తమ పరం అవుతుందని భావిస్తోంది.