ఉత్తరాంధ్రా నుంచి జగన్!

రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. 2019 ఎన్నికల ముందు ఇచ్చాపురంలో తన పాదయాత్రను జగన్ ముగించారు. ఆ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టింది వైసీపీ. ఫ్యాన్ సునామీ ఉత్తరాంధ్రాను ఊపేసింది. ఈసారి ఎన్నికల…

రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. 2019 ఎన్నికల ముందు ఇచ్చాపురంలో తన పాదయాత్రను జగన్ ముగించారు. ఆ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టింది వైసీపీ. ఫ్యాన్ సునామీ ఉత్తరాంధ్రాను ఊపేసింది. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ఇచ్చాపురంతోనే ఆరంభించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.

ఈ నెల 18న ఆయన ఉత్తరాంధ్రాకు వస్తారని నేరుగా ఇచ్చాపురం నుంచే వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు అని పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఆ రోజున తొలి సభను ఇచ్చాపురంలో నిర్వహిస్తారని ఆ వెంటనే కోస్తా జిల్లాలలో మరో సభ, రాయలసీమలో ఇంకో సభ ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ ఉత్తరాంధ్రాను ఎంచుకోవడం వెనక ప్రత్యేక వ్యూహం ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఈసారి కూడా గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధిస్తే వైసీపీ విజయం మరింత ఈజీ అవుతుంది అని అంటున్నారు. ఇచ్చాపురం గత రెండు ఎన్నికల నుంచి వైసీపీని ఒకింత నిరాశ పరుస్తోంది. 2019లో దగ్గర దాకా వచ్చినా విజయం దక్కలేదు.

ఈసారి ఇచ్చాపురాన్ని కొట్టాలన్న కసి వైసీపీలో కనిపిస్తోంది. దాంతో అక్కడ నుంచే జగన్ తన ఎన్నికల తొలి సమర భేరీని మోగిస్తారు అని అంటున్నారు. గత రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేనే టీడీపీ అభ్యర్ధిగా ఉంటున్నారు. దాంతో ఆయన పట్ల ఉన్న యాంటీ ఇంకెంబెన్సీకి తోడు వైసీపీ సంక్షేమం ఆ పార్టీ పట్ల ఏర్పడిన సానుభూతి ఈసారి గెలిపించి తీరుతాయని అంటున్నారు.

ఇచ్చాపురం నుంచి మొదలెడితే రాజకీయంగా మేలు అన్నది భావించే వైసీపీ వర్గాలు జగన్ మొదటి సభను అక్కడ ఏర్పాటు చేశాయి. శ్రీకాకుళం నుంచి ప్రారంభించి అదే  క్రమంలో మొత్తం ఉత్తరాంధ్రలోని  అన్నిఅసెంబ్లీ నియోజకవర్గాలను జగన్ టచ్ చేస్తారు అని అంటున్నారు.

ఈసారి వైసీపీ తరఫున జగన్ ఒక్కరే స్టార్ కాంపెనియర్ గా ఉండబోతున్నారు. దాంతో ఆయన దాదాపుగా ముప్పయి రోజుల పాటు అలుపెరగని తీరులో ప్రచారం సాగిస్తారు అని అంటున్నారు.