ఆర్ఆర్ఆర్.. ఇక గోడ మీద నుంచి దూకవచ్చు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దయతో ఎంపీగా గెలిచి, అప్పటినుంచి కూడా తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతూ వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ఇక గోడ మీదినుంచి కిందికి దిగవచ్చు. Advertisement ఎటూ తనను…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దయతో ఎంపీగా గెలిచి, అప్పటినుంచి కూడా తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతూ వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ఇక గోడ మీదినుంచి కిందికి దిగవచ్చు.

ఎటూ తనను గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ తో సున్నం పెట్టుకున్న తర్వాత.. ఇతర పార్టీల్లో ఎందులోకి గెంతుదామా అని నిరీక్షిస్తూ.. అన్ని పార్టీల నాయకులకూ సేవలు చేసుకుంటూ నాలుగేళ్లుగా రోజులు నెట్టుకొస్తున్న రఘురామక్రిష్ణ రాజు.. ఇప్పుడు భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలతో తొలినుంచి సత్సంబంధాలు కలిగి ఉంటూ.. వారి సేవలో తరించిపోతున్న ఆయన.. ఇప్పుడు తాను కోరుకుంటున్న నరసాపురం నియోజకవర్గం పంపకాల్లో భాజపాకు దక్కడంతో ఆ పార్టీలో చేరబోతున్నారు.

ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. గెలిచిన కొన్నాళ్లకే వైసీపీతో తగాదా పెట్టుకున్నారు. అహంకారంతో జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తూ దుష్ప్రచారం సాగించడం మొదలెట్టారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. ప్రతిపక్షాలకంటె ముందుగా ఆ నిర్ణయాన్ని తిట్టిపోస్తూ రఘురామ మీడియా ముందుకు వచ్చేవాళ్లు. మీడియా ఆయన కామెడీని పట్టించుకోవడం మానేసిన తర్వాత.. ధర్మపీఠం పేరుతో తన ఢిల్లీ ఇంట్లో ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టి.. ఎవరొచ్చినా రాకపోయినా.. ఒక వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టుకోవడం ఒక మార్గంగా మార్చుకున్నారు.

నరసాపురం ఎంపీగా గెలిచిన నాటినుంచి.. తనను గెలిపించిన ప్రజల మొహం చూసి ఎరగని ఈ ఎంపీ.. తాను నియోజకవర్గానికి రాకుండా వైసీపీ అడ్డుకుంటున్నదని నిందలు వేసేవాళ్లు. తీరా ఇటీవల తాను నరసాపురం నియోజకవర్గం నుంచే మళ్లీ ఎంపీగా పోటీచేస్తానని ఆయన వెల్లడించారు.

అయితే ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది మాత్రం తర్వాత చెబుతానంటూ ఆయన ఓ మడత పేచీ పెట్టారు. మూడు పార్టీలు కలిసి పోటీచేయడం ఖాయం అంటూ వచ్చిన ఆయన, పొత్తుల్లో ఏ పార్టీకి నరసాపురం దక్కితే ఆ పార్టీ తరఫున బరిలో ఉంటానంటూ.. తన అభ్యర్థిత్వాన్ని తానే చాలా ధీమాగా, చాలా ముందుగా ప్రకటించేసుకున్నారు. ఆ రకంగా తనలో ఉన్న గోడమీది పిల్లి వైఖరిని, తన అవకాశవాద ధోరణిని ఆయన బయటపెట్టుకున్నారు.

తీరా ఇప్పుడు సీట్ల పంపకాల్లో నరసాపురం బిజెపికి దక్కింది. బిజెపి పెద్దలతో ఆర్ఆర్ఆర్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఇప్పుడు ఆ పార్టీలో చేరి, వెంటనే టికెట్ పుచ్చుకుని బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.