హిందూ ఓటుబ్యాంకు పోలరైజేషన్‌కు బ్రహ్మాస్త్రం!

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించడం అనేది సర్వసాధారణమైన వ్యవహారం. ఇందుకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎత్తుగడ ఉంటుంది. Advertisement భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత…

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించడం అనేది సర్వసాధారణమైన వ్యవహారం. ఇందుకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎత్తుగడ ఉంటుంది.

భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ‘హిందూత్వ’ అనే ఎజెండా వారికి ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రం అనే మాట అందరూ ఉంటారు. కేవలం హిందూ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవడానికే, పోలరైజ్ చేయడానికే.. అయోధ్యలో రామాలయాన్ని కూడా ఇంకా నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించేశారని అనేక విమర్శలు కూడా వచ్చాయి.

కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని మించి.. దేశవ్యాప్తంగా ఉండగల హిందూ ఓట్లను పోలరైజ్ చేయగల అద్భుతమైన బ్రహ్మాస్త్రం భాజపా అమ్ముల పొదిలో సిద్ధంగా ఉన్నదని. ఆ అస్త్రాన్ని కేంద్రంలోని భాజపా సర్కారు సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు కొన్ని రోజుల ముందున దేశం మీదికి ప్రయోగించేశారు. ఆ బ్రహ్మాస్త్రమే సీఏఏ!

వివాదాస్పదమైన, ఉభయ సభల ఆమోదం కూడా పొంది చట్టరూపాన్ని సంతరించుకున్న పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు ఈ దేశంలో అమల్లోకి వచ్చేసింది. పొరుగు దేశాల నుంచి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతరులైన ఇతర మతస్తులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిన చట్టం ఇది. 2014కు పూర్వం భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

భారతదేశంలో మతం ప్రాతిపదికగా పౌరసత్వం కల్పించే ఈ చట్టం, బిల్లు దశలో ఉన్నప్పటినుంచే చాలా వివాదాలకు కేంద్రమైంది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. ముస్లింలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ముస్లిం సమాజాన్ని అభద్రతకు గురిచేసేలా ఉన్నదని వ్యాఖ్యానించారు. 2019లోనే ఈ చట్టం ఉభయ సభల ఆమోదం పొందినప్పటికీ.. అమలు చేయకుండా ప్రభుత్వం ఆగింది. సరిగ్గా ఎన్నికల ముందు దీనిని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

సాధారణంగా ప్రేమ కంటె ద్వేషం గొప్పది. ప్రేమతో ఎందరు మనుషులు ఒక్కతాటిమీదకు వస్తారో గానీ.. ద్వేషం వల్ల, భయం వల్ల మాత్రం చాలా ఈజీగా అందరూ ఒక్కటవుతారు. ఇప్పుడు భాజపా అనుసరిస్తున్న సిద్ధాంతం కూడా అదే. రాముడి ఆలయం ప్రారంభించడం వల్ల హిందూ ఓటు బ్యాంకు, రాముడిని భక్తితో కొలిచే ఓటు బ్యాంకు భాజపాను ఆరాధించవచ్చు. కానీ రామభక్తుల్లో ఇతర పార్టీల వారు కూడా తప్పకుండా ఉంటారు.

కానీ.. సీఏఏ బిల్లు అమల్లోకి తేవడం ద్వారా.. ముస్లింలను ద్వేషించే వారంతా ఒక్కతాటిమీదకు వచ్చి.. కేవలం బిజెపిని మాత్రమే ఆరాధిస్తారు. అందుకే.. రామాలయం కంటె.. సీఏఏ చట్టం పెద్ద బ్రహ్మాస్త్రం అని, ఎక్కువగా హిందూ ఓట్లను బిజెపికి అనుకూలంగా మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.