పులి మీద వాళ్లిద్దరి స్వారీ

ఏపీలో ఆల్రెడీ ఇప్పటికే పొత్తు పెట్టుకొని బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కనుక పొత్తు ఖరారు చేసుకుంటే మాత్రం వాళ్ళు పులి మీద స్వారీ చేసినట్లేనని చెప్పుకోవాలి. చంద్రబాబు…

ఏపీలో ఆల్రెడీ ఇప్పటికే పొత్తు పెట్టుకొని బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కనుక పొత్తు ఖరారు చేసుకుంటే మాత్రం వాళ్ళు పులి మీద స్వారీ చేసినట్లేనని చెప్పుకోవాలి. చంద్రబాబు ఇచ్చే సీట్ల ఆఫర్ తో బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటుందా అనేది అనుమానమే.

కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం బాబు బీజేపీకి ఐదు పార్లమెంటు స్థానాలు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేస్తాడట. బీజేపీ ఈ ఆఫర్ కు ఒప్పుకుంటుందా ? అర కొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌ కోసమే తప్ప, బీజేపీకి లాభం చేసేందుకు టీడీపీ పొత్తు పెట్టుకోవడం లేదనే చర్చ జరుగుతోంది.  

చంద్రబాబు మార్కు రాజకీయాలు తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. టీడీపీని బీజేపీ చీదరించుకుంటున్నా చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. బీజేపీని చంద్రబాబు, పవన్‌ బతిమాలే పరిస్థితికి వచ్చారు. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చారు. 

ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం తనకు సింగిల్‌గా అసాధ్యం కాబట్టి ఢిల్లీ పెద్దల పొత్తు, సపోర్ట్ అవసరం అని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు. దానికితోడు కాపుల మద్దతు కోసం ఇటు పవన్ సైతం కావాల్సి వచ్చింది. దీంతో పవన్, బీజేపీ, టీడీపీ ఇలా ముగ్గురూ పొత్తులో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

అయితే, ఇప్పుడున్న బీజేపీ గతంలో అద్వానీ.. వాజ్‌పేయ్‌ కాలం నాటి బీజేపీ కాదు. ఇది మోదీ, అమిత్‌ షాల సారధ్యంలో ఉన్న టర్బో ఇంజిన్ ఉన్న ఫైటర్ జెట్ లాంటి బీజేపీ. దానికి ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే తప్ప కలుపుకుని పోవడం అలవాటులేదు. దానికితోడు జాతీయ స్థాయిలో అవకాశవాదానికి బ్రాండ్ నేమ్ అని ముద్రపడిన చంద్రబాబును నమ్మడం ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు.

గతంలో అంటే 1999, 2014లో బీజేపీ సపోర్ట్‌తో గెలిచిన చంద్రబాబు ఆ తరువాత ఆ పార్టీని దాని నాయకులను ఎలా అవమానించింది అందరికీ తెలిసిందే. కేవలం కొన్ని  సీట్లు పడేసి.. బీజేపీ మద్దతు పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది పవర్ అనుభవిద్దాం అనుకుంటే అప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు నడవదు. అవ్వాకావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. 

కాబట్టి ఈసారి పొత్తులకు వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ వాళ్ళు సవాలక్ష కండీషన్లు పెట్టే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. చాలా ఎక్కువ సీట్లు అడుగుతారని అనుకుంటున్నారు. సరే …బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుందనే విషయం అలా పక్కనుంచితే ఏదో విధంగా పొత్తు కుదిరితే మాత్రం బాబుకు గడ్డు కాలమే. బీజేపీతో వెళితే మాత్రం వాళ్ళ కండీషన్స్‌ను ఒప్పుకోవాలి. 

లేకుండా వెళ్తే.. ఎన్నికలలోపే గేమ్ ముగిసిపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్‌ వేసే ఎత్తులు.. వ్యూహాల ముందు చంద్రబాబు ఎదురు నిలవలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ ఎన్నికల మ్యానేజ్‌మెంట్‌లో విశ్వరూపం చూపించారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎందుకు ఊరుకుంటారు. ఆ భయం కూడా చంద్రబాబును నిద్రకు దూరం చేస్తోంది.

పొత్తు కుదిరితే ఇప్పటికే విడుదల చేసిన జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉంది. రెండోజాబితా విడుదలైతే చూడాలి తమ్ముళ్ళ వీరంగాలు. మొదటి జాబితా విడుదలచేసి చాలా రోజులైనా ఇప్పటివరకు రెండోజాబితాను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేయలేకపోయారు. మొదటిజాబితా విడుదలతోనే రెండు పార్టీల్లో నానా గొడవలవుతున్నాయి. 

వాటిని సర్దుబాటు చేయలేక ఇద్దరు అధినేతలు నానా అవస్థ‌లు పడుతున్నారు. వైసీపీ 8 జాబితాలను విడుదల చేసినప్పుడు టికెట్లు దక్కని ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. దాదాపు 24 మందికి టికెట్లు దక్కకపోతే అందులో పార్టీమారింది ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. మిగిలిన వారిలో ఇద్దరు ముగ్గురు అప్పట్లో కోపంతో మాట్లాడినా తర్వాత జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్పుకుని పార్టీలో కంటిన్యూ అవుతున్నారు.

అలాగే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు అసంతృప్తి వ్యక్తం చేసినా మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ మాత్రమే టీడీపీలో చేరారు. మొత్తంమీద టికెట్లు దక్కనివారిని, నియోజకవర్గాలు మారినవారిని జగన్ పైకి రెచ్చగొట్టేందుకు చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా ఎంత ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ దొరకలేదు.

అదే సమయంలో చంద్రబాబు, పవన్ విడుదలచేసిన ఒక్క జాబితాకే నేతల ఆగ్రహాన్ని తట్టుకోలేక చంద్రబాబు, పవన్ తల్లకిందులైపోతున్నారు. వాళ్ళ ఆగ్రహాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిందే అని తమ్ముళ్ళు గోలగోల చేస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీదకు దాడులు చేశారు. చంద్రబాబు, లోకేష్ కటౌట్లను తగలబెట్టేశారు. 

తమ్ముళ్ళ ఆగ్రహం దెబ్బకు చంద్రబాబు, లోకేష్ ఫోన్లో కూడా దొరకటంలేదట. జనసేన అభ్యర్థులను ప్రకటించిన ఐదింటిలో మూడు నియోజకవర్గాల్లో గోలగోల జరుగుతోంది. చంద్రబాబు ప్రకటించాల్సిన 57 నియోజకవర్గాలు, పవన్ ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. మధ్యలో పొత్తులో బీజేపీ కూడా చేరితే వీళ్ళపని అంతే సంగతులు.