అయోధ్య రామాలయంలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రామాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రామభక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు.
అనంతపురం ధర్మవరానికి చెందిన ఓ చేనేత కార్మికుడు, తనదైన శైలిలో రాములోరిపై భక్తిని చాటుకున్నాడు. ఏకంగా లక్షన్నర రూపాయల ఖరీదు చేసే పట్టుచీరను సీతమ్మవారి కోసం తయారుచేశాడు. దీని కోసం అతడు ఏకంగా 4 నెలల పాటు కష్టపడ్డాడు.
ఈ చీరలో చాలా ప్రత్యేకతలున్నాయి. చీర బోర్డర్ పై రామాయణానికి చెందిన దృశ్యాల్ని పొందుపరిచాడు. పుత్రకామేష్టి యాగం నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు చాలా ఘట్టాల్ని ఈ చీర అంచుపై చూడొచ్చు. ఇక చీర లోపల భాగంలో జై శ్రీరామ్ అనే నామాన్ని 322 సార్లు పొందుపరిచాడు. ఈ నామాలన్నీ 13 భాషల్లో ఉంటాయి.
శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం నాటికి ఈ చీరను అయోధ్యలో ట్రస్ట్ కు అందిస్తానంటున్నాడు ఈ చేనేత కళాకారుడు.
రేపట్నుంచే ప్రత్యేక పూజలు… ఇక రేపట్నుంచి మందిరంలో ప్రత్యేక పూజలు ప్రారంభంకాబోతున్నాయి. రేపట్నుంచి ఆలయంలో ఏర్పాటుచేసిన 1008 మహాకుండ్ ల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. దీనికోసం ఇప్పటికే 40వేల మందికి పైగా అర్చకులు అయోధ్యకు చేరుకున్నారు.
ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతి.. ప్రాణప్రతిష్టకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీళ్లందరికీ ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబోతున్నారు. ఆలయ నిర్మాణం కోసం పునాదులు త్రవ్వినప్పుడు వెలికితీసిన మట్టిని ప్యాక్ చేసి ఆహుతులకు అందించబోతున్నారు. దీనికి రామ్ రాజ్ అనే పేరుపెట్టారు.
రామ్ రాజ్ ప్యాకేజీతో పాటు.. దేశీ నెయ్యితో ప్రత్యేకంగా తయారుచేసిన మోతీచూర్ లడ్డూను ప్రాణప్రతిష్ట రోజు ప్రసాదంగా అందించబోతున్నారు. ఈ ప్రసాదంతో పాటు, రాముని చిత్రపటాన్ని కూడా బహుకరించబోతున్నారు.