ఏపీ బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు దక్కాయి. అయితే కేటాయించే సీట్లపై ప్రతిష్టంభన నెలకుంది. ఓడిపోయే సీట్లను తమకు కేటాయించారని, ఈ మాత్రం దానికైతే పొత్తు ఎందుకని బీజేపీ నేతల నుంచి వస్తున్న ప్రశ్న. ఈ విషయమై నిఖార్సైన బీజేపీ నేతలకు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా జాతీయ నాయకత్వానికి ఒక ఫిర్యాదు చేశారు.
దశాబ్దాలుగా టీడీపీ కూడా గెలవని సీట్లను తమకు ఇచ్చారని, అలాగే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు మాత్రమే టికెట్లు ఇచ్చుకునేందుకే సీట్లు కేటాయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే, టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వొద్దని కూడా అందులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పురందేశ్వరిని ఢిల్లీకి పిలిపించుకుని బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు.
సీట్లపై స్పష్టత వస్తే, అభ్యర్థులను ఎంపిక చేయవచ్చనేది నాయకుల అభిప్రాయం. ఓడిపోయే సీట్లు తమకెందుకని బీజేపీ నేతలు నిరాసక్తత చూపుతుండడం, మరోవైపు చంద్రబాబునాయుడు తెలివిగా తనకు కావాల్సిన సీట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. తమకు అనుకూలమైన సీట్లన్నీ తీసుకుని, ఫలానా నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమన్న సీట్లనే తమకు ఇచ్చారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
చంద్రబాబు విదిల్చిన సీట్లనే , మహాభాగ్యమనుకుని చివరికి బీజేపీ సర్దుకుంటా? లేక ఒత్తిడి చేసైనా అనుకున్నది సాధిస్తుందా? అనేది తేలాల్సి వుంది. ఈ విషయమై స్పష్టత వచ్చే వరకూ బీజేపీ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతూనే వుంటుంది.