అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజకీయ వాతావరణం మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటూఇటూ రాజకీయ జంపింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గంలో కీలకమైన నాయకుడు వైసీపీలో చేరిక ఆ పార్టీకి బలమే. రాయచోటి టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌రెడ్డి టికెట్ ఆశించారు. అయితే చంద్రబాబు నిర్ణయం ఆయనకు భంగపాటు మిగిల్చింది.
రాయచోటి సీటును మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి కేటాయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి అలకబూనారు. కొంత కాలంగా ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. తన కార్యాలయంలో చంద్రబాబు ఫొటోలు, పార్టీ జెండాలు, ప్లెక్సీలను తొలగించారు. చంద్రబాబు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన గత నెలలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
ఎట్టకేలకు వైసీపీలో చేరేందుకు ఆయన్ను ఆ పార్టీ కీలక నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఒప్పించారు. మిథున్‌రెడ్డితో పాటు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్వయంగా రమేష్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించారు. వైసీపీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డికి స్వయంగా రమేష్‌రెడ్డి అన్న. శ్రీనివాస్‌రెడ్డి భార్య మాధవీరెడ్డి ప్రస్తుతం కడప అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒకట్రెండు రోజుల్లో వైఎస్ జగన్ సమక్షంలో రమేష్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈయన చేరికతో రాయచోటిలో వైసీపీ గెలుపు మరింత సునాయాసమైంది. రమేష్‌రెడ్డి చేరుతారనే ప్రచారంతో వైసీపీలో జోష్ పెరిగింది.