జనసేనలో కీలక నాయకుడు పోతిన మహేశ్. విజయవాడ వెస్ట్‌లో పదేళ్లుగా ఆయన శ్రమిస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ కార్యక్రమాలను క్రమశిక్షణతో చేసిన నాయకుల్లో పోతిన మహేశ్ ముఖ్యుడు. బహుశా ఆయనకు టికెట్ రాకపోవడానికి కూడా అదే కారణమై వుండొచ్చు. పోతిన మహేశ్ దగ్గర బాగా డబ్బు వుండి వుంటే, లేదా టీడీపీ నాయకుడైనా ఆయనకు టికెట్ దక్కేది.
ఆ అర్హతలేవీ లేకపోవడం వల్ల పవన్‌కల్యాణ్ ఖాతరు చేయలేదు. విజయవాడ వెస్ట్ సీటును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుజనాచౌదరికి కేటాయించారు. దీంతో ఇక తనకు జనసేనలో రాజకీయ భవిష్యత్ లేదని అతనికి అర్థమైంది. అయినప్పటికీ ఆయన కొన్నిరోజులుగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాటలో ఉన్నారు. నిర్ణయంలో జాప్యమవుతుండడంతో ఆయనపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. దీన్నిబట్టి ఆయన ఇక జనసేనను వీడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. సీటు రాదని తాను ఫిక్స్ అయినట్టు తేల్చి చెప్పారు. రాజధాని ప్రాంతంలో జనసేన ఉనికి పోవద్దనే ఇంకాలం పని చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
సీట్ల విషయంలో టీడీపీలో మార్పులు జరుగుతున్నాయన్నారు. కానీ జనసేనలో ఎక్కడా మార్పులు కనిపించడం లేదన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి కూటమి తరపున బలమైన అభ్యర్థి సుజనాచౌదరి వచ్చాడన్నారు. సుజనాను కాదని సీటు వస్తుందనుకుంటే అవివేకం అవుతుందన్నారు. ఇక తనకు సీటు రాదని తేలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్‌పై చర్చించామన్నారు. ఎలా ముందుకెళ్లాలనే విషయమై మాట్లాడుకున్నట్టు ఆయన చెప్పారు.
కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించామన్నారు. భవిష్యత్‌పై మంచి అభిప్రాయాన్ని తెలియజేశారన్నారు. మరోసారి సోమవారం భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తామన్నారు. దీంతో పోతిన… ఇక జనసేనను వీడి పోతున్నట్టే అనే చర్చ విజయవాడలో జరుగుతోంది. ఆయన ఇండిపెండెంట్‌గా నిలుస్తారా? లేక మరేదైనా పార్టీకి మద్దతు ఇస్తారా? అనేది తేలాల్సి వుంది.