ప్రకృతి, కాలం కంటే అధికారం గొప్ప‌ది కాదు!

చంద్ర‌బాబు స‌ర్కార్ ప్రాధాన్య అంశాలేంటో కొన్ని రోజులుగా అంద‌రూ చూస్తున్నారు. రాజ‌కీయంగా వైసీపీని క‌నుమ‌రుగు చేయాల‌నేది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్‌లో త‌న వార‌సుడికి రాజ‌కీయంగా ఎదురు లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. అయితే…

చంద్ర‌బాబు స‌ర్కార్ ప్రాధాన్య అంశాలేంటో కొన్ని రోజులుగా అంద‌రూ చూస్తున్నారు. రాజ‌కీయంగా వైసీపీని క‌నుమ‌రుగు చేయాల‌నేది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్‌లో త‌న వార‌సుడికి రాజ‌కీయంగా ఎదురు లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. అయితే ఇది ప్ర‌కృతి విరుద్ధ‌మ‌ని, ప్ర‌తిప‌క్ష‌మ‌నేది లేకుండా చేయ‌డం కుద‌ర‌ద‌ని ఆయ‌న‌కు తెలియంది కాదు.

అలాగ‌ని చంద్ర‌బాబు ఊరికే కూర్చోరు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల అమ‌లుపై కంటే వ్య‌క్తిగ‌త ఎజెండా నెర‌వేర్చుకోడానికి ఆస‌క్తి చూపుతున్నార‌నే భావ‌న క్రియేట్ చేయ‌డంలో చంద్ర‌బాబు స‌ర్కార్ విజ‌య‌వంత‌మైంది. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ ప‌దిశాతం కూల్చివేత‌ల‌కు పాల్ప‌డితే, ఇప్పుడొచ్చిన కొత్త ప్ర‌భుత్వం దాన్ని రెట్టింపు చేసింద‌ని జ‌నం అనుకుంటున్నారు. దీంతో ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం ఏర్ప‌డింది.

నిజానికి చంద్ర‌బాబు స‌ర్కార్ నుంచి ఇలాంటివి ప్ర‌జ‌లు కోరుకోవ‌డం లేదు. జ‌గ‌న్ కంటే భిన్న‌మైన‌, జ‌న‌రంజ‌క‌మైన పాల‌న అందిస్తార‌ని ఆశించారు. రైతు భ‌రోసా, త‌ల్లికి వంద‌నం, అరియ‌ర్స్‌తో క‌లిపి పెంచిన పింఛ‌న్లు, అలాగే 50 ఏళ్లు దాటిన బీసీలు పింఛ‌న్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మెగా డీఎస్సీపై ప్ర‌క‌ట‌న ఓకే. ఇక మిగిలిన తంతు ఎప్పుడు, ఎలా సాగుతుందో అని నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ కూల్చివేత‌లు, ఐదేళ్లు తిరిగే స‌రికి ఎవ‌రి కూల్చివేత‌కు దారి తీశాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా పాలిస్తే, ఎవ‌రినీ ప్ర‌జ‌లు వ‌దిలిపెట్ట‌రు. ఈ సూత్రం కూట‌మి ప్ర‌భుత్వానికి కూడా వ‌ర్తిస్తుంది. అయితే అన్నీ తెలిసి కూడా కూల్చివేత‌ల‌కు తెర‌లేపారంటే, భ‌విష్య‌త్ ప‌రిణామాల‌కు సిద్ధ‌మ‌య్యే చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అర్థం చేసుకోవాలి. ఇక చెప్ప‌డానికి కూడా ఏమీ ఉండ‌దు.

బ‌హుశా ఏదైతే అది కానీలే అని తెగింపు ధోర‌ణితో పాల‌కులు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అధికారంలో వుంటే, కూల్చివేత‌ల ఆలోచ‌నలే త‌ప్ప‌, నిర్మాణాల‌పై ఉండ‌దేమో. అధికారాన్ని మంచి కోసం ఉప‌యోగిస్తే, ప్ర‌జాద‌ర‌ణ పొందొచ్చు. కానీ క‌క్ష‌, కార్ప‌ణ్యాల‌కు తీర్చుకోడానికైతే మాత్రం… ఇవ‌న్నీ తాత్కాలిక ఆనందం మిగుల్చుతాయ‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.

ప్ర‌తి కూల్చివేత కొత్త నిర్మాణానికి , అలాగే ప్ర‌తి వినాశ‌నం మ‌రో సృష్టికి హేతువు అవుతాయి. తాజాగా కొత్త ప్ర‌భుత్వ కూల్చివేత‌లు.. భ‌విష్య‌త్‌లో కొత్త నిర్మాణాల‌కు దారి తీస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే అవి ఎలాంటివో ఇప్పుడిప్పుడే చెప్ప‌డం క‌ష్టం. ప్ర‌కృతి, కాలం కంటే ఏ అధికారం గొప్ప‌ది కాదు

One Reply to “ప్రకృతి, కాలం కంటే అధికారం గొప్ప‌ది కాదు!”

Comments are closed.