కేజ్రీ : ఆకులో ముద్ద నోటికి అందలేదే!

టైం బాగోలేకపోతే.. ‘ఆకులో ముద్ద నోటికి అందకుండా పోతుందని’ ఒక సామెత ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ప్రస్తుతం ఆ సామెత లాగానే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక…

టైం బాగోలేకపోతే.. ‘ఆకులో ముద్ద నోటికి అందకుండా పోతుందని’ ఒక సామెత ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ప్రస్తుతం ఆ సామెత లాగానే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు, రౌస్ ఎవెన్యూ కోర్టు గురువారం నాడు రెగులర్ బెయిల్ మంజూరు చేసింది.

ఆ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం నాడు ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈలోగా ఈడీ హైకోర్టు తలుపు తట్టడమూ, హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడమూ కూడా జరిగిపోయింది. ఈడీ పిటిషన్ ను హైకోర్టు విచారించే వరకు బెయిలు ఉత్తర్వులు అమలు కావడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది.

నిజానికి అరవింద్ కేజ్రీవాల్ బెయిలు కోసం పలు దఫాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించడానికి కోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు ఇచ్చింది. ప్రచార పర్వం పూర్తయిన తర్వాత.. తల్లిదండ్రుల ఆరోగ్య కారణాల రీత్యా బెయిలు పొడిగించాలని ఆయన విన్నవించుకున్నప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లారు.

తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టు గురువారం రెగులర్ బెయిలు మంజూరు చేసింది. ఆప్ మంత్రి అతిశీ ఈ పరిణామంపై సత్యమేవ జయతే అంటూ హర్షం వ్యక్తం చేసింది కూడా. ఢిల్లీ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా.. బెయిలు అమలును రెండు రోజుల పాటు ఆపాలని ఈడీ విన్నవించినప్పటికీ.. పట్టించుకోలేదు.

అయితే ఈడీ చాలా వేగంగా స్పందించింది. వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో.. వారు స్టే ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈడీ పిటిషన్ ను విచారించి ఏ సంగతి తేల్చేవరకు, రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిలు ఉత్తర్వులు అమలు కాకుండా  చేశారు. శుక్రవారం కేజ్రీవాల్ విడుదల కావాల్సి ఉండగా, అందుకు కొన్ని గంటల ముందు ఇలాంటి తీర్పు వచ్చింది. దీంతో ఆప్ వర్గాలు షాక్ కు గురయ్యాయి.

మరోవైపు తెలంగాణ నాయకురాలు, కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీ శుక్రవారంతో ముగుస్తుంది. ఆమెను కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తారో లేదో ఇవాళ తేలుతుంది. కేజ్రీవాల్ కు మంజూరైన బెయిలు కూడా ఆగిపోయిన నేపథ్యంలో కవితక్కకు బెయిలు దక్కడం కష్టమని పలువురు అంచనా వేస్తున్నారు.