గతం నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకుని మారితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి. ప్రజలూ బాగుంటారు. పార్టీలు మారితే బాగుపడే వర్గాలు కొన్ని వుంటాయి. అయితే ఆ సంఖ్య తక్కువ. ఎవరు అధికారంలో ఉన్నా తమ జీవితాలు బాగుంటే చాలని సాధారణ ప్రజలు, సామాన్యులు కోరుకుంటారు, ఆశిస్తారు. కానీ దురదృష్టంకొద్దీ అదే జరగడం లేదు. చంద్రబాబు అనుభవం 46 ఏళ్లు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రికార్డ్ వుంది. ఈ టర్మ్ పూర్తి చేసుకుంటే 19 ఏళ్లు సీఎంగా ఉన్న ఏకైక తెలుగు నాయకుడు.
బాబు పాలనను ఒకసారి పరిశీలిస్తే ఆయన చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ప్రతిదీ అద్భుతం అని చెప్పే మీడియా వుంది. హైదరాబాద్‌కి ఐటీ తానే తెచ్చానని చెప్పుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఏ నగరం కూడా ఆయన హయాంలో ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పరు.
గతం వదిలేసి ఇప్పటి విషయాలు మాట్లాడుకుంటే, జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడని బాబు అంటున్నారు. మరి ఆయన హయాంలో జరిగిన లక్షల కోట్ల అప్పు సంగతేంటి? పోలవరం అన్యాయమైంది అంటారు. మోదీ ప్రభుత్వంతో సఖ్యంగా ఉన్న ఐదేళ్లు ఎందుకు పూర్తి చేయలేకపోయాడో చెప్పరు. అమరావతి అధ్వాన్నమైందని శోకాలు పెడుతున్నారు.
అసలు వైజాగ్ లాంటి నగరం వుండగా, అమరావతి నిర్మాణం ఎందుకు నెత్తికెత్తుకున్నాడో చెప్పడు. దానికి ఏదో పిచ్చి లెక్క చెబుతాడు. అమరావతి అటూఇటూ సమానంగా మధ్యలో వుందట! రాజధాని ఎప్పుడూ రాష్ట్రం నడిమధ్యన ఉండాలట!
పైరవీకారులకి, కాంట్రాక్టర్లకి, భజన బృందాలకి తప్ప రాజధానికి రావాల్సిన అవసరం ఎవరికి వుంటుంది? సామాన్య ప్రజలు తెల్లారిలేస్తే రాజధానికి ఎందుకొస్తారు? వేల మంది రైతుల్ని ఒప్పందంలోకి లాగి, సెల్ఫ్ ఫైనాన్స్ అని కలర్ ఇచ్చి, వేలకోట్లు పెట్టేబదులు వైజాగ్‌ని ఎంచుకుని వుంటే అసలు సమస్యే లేదు కదా?
సరే, ఆయన పోలవరం పూర్తి చేసినా, అమరావతి కట్టినా ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు. సంతోషమే. మరి జనాలకి ఇస్తానన్న పథకాల మాటేంటి? అందరూ ఎదురు చూస్తున్నది వాటి కోసమే కదా, మ్యానిఫెస్టో ప్రకారం చెప్పినవన్నీ ఇచ్చే దిశగా ఇప్పటి వరకు ఇంకా మాట్లాడలేదు.
ఆయనలో జనం ఏం మార్పు కోరుకుంటున్నారంటే, గతంలో లాగా సింగపూర్, మలేషియా సీఈవో అని కార్పొరేట్ మాటలు మాట్లాడకుండా సామాన్యులు, రైతుల గురించి ఆలోచించాలి.
వయసు, అవకాశం రీత్యా ఆయన కెరీర్‌లో ఇది కీలక సమయం. చేయాలనుకుంటే ఇపుడే చేయాలి. మళ్లీ వయసు సహకరించకపోవచ్చు. కేంద్రంలో ఈసారిలా చక్రం తిప్పే అవకాశం రాకపోవచ్చు.
ప్రతిదానికీ జగన్‌ని నిందించడం మానాలి. ఆయన పాలన వద్దనుకుని మిమ్మల్ని గెలిపించారు. ఇది ప్రజాతీర్పు. గతంలో జగన్ టీడీపీ వైఫల్యాలంటూ ఏళ్ల తరబడి మాట్లాడినట్టు, చంద్రబాబు కూడా వైసీపీ వైఫల్యాలని మాట్లాడితే జనం సహించరు. మీరు చేయబోయే పనుల మీదే తప్ప, వాళ్లకి గత పాలకుల మీద ఫోకస్ వుండదు. ఉన్నా ఎంతో కాలం వుండదు.
స్పెషల్ స్టేటస్ అనేది చాలా కాలంగా ఊరగాయ జాడీలో భద్రంగా వుంది. మోదీకి నచ్చచెప్పి దాన్ని బయటికి తీస్తే జనం సంతోషిస్తారు. జగన్ పాలనలో ధరలు పెరిగాయని అన్నారు. మీరు తగ్గించి చూపండి.
కేంద్రం నుంచి మ్యాగ్జిమమ్ నిధులు తీసుకొచ్చి మీరు చెప్పిన 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇచ్చినా తీసుకునే వాడు ఉండడు. విశాఖ ఉక్కు తుక్కు కాకుండా చూడండి. రైల్వేజోన్‌ను తీసుకురండి.
ప్రపంచంలో ఏ నగరమూ చూస్తూ వుండగా నిర్మాణం కాదు. అమరావతి కూడా అంతే. హడావుడి చేసి వేలకోట్లు పెడితే , తర్వాత అప్పు కూడా పుట్టదు. రాష్ట్రాన్ని అమ్మాల్సిందే. మీ తప్పుల కోసం జగన్ ఎదురు చూస్తున్నాడు.