కల్కిలో చాలా సర్ ప్రైజులు, అతిథి పాత్రలున్నాయనే ప్రచారం చాలా రోజులుగా నడుస్తోంది. తాజాగా బయటకొచ్చిన సెన్సార్ టాక్ లో కూడా ఇదే మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు.
ఇప్పుడా సర్ ప్రైజులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈరోజు కల్కి సినిమా నుంచి శోభన లుక్ రిలీజ్ చేశారు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కల్కి సినిమాతో శోభన టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు. కల్కిలో శోభన ఎమోషనల్ పాత్ర పోషించినట్టు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది.
మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి చేసిన గేమ్ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు శోభన. అయితే అడపాదడపా మలయాళం, తమిళ్ లో ఆమె సినిమాలు చేస్తున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు కల్కి సినిమాతో ఆమె తెలుగులోకి అడుగుపెట్టారు. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో, ఇకపై మరిన్ని సర్ ప్రైజులు బయటకొచ్చే అవకాశం ఉంది.
ఈరోజు ముంబయిలో కల్కి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనేందుకు ఆల్రెడీ ప్రభాస్, ముంబయిలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ కూడా కొన్ని సర్ ప్రైజులున్నాయంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2 గంటల 56 నిమిషాలుంది.