కొడాలి నాని వేషంలో జెసి

జ‌గ‌న్ ఈవిఎంల వ‌ల్ల ఓడిపోయిన మాట నిజ‌మే. ఈవిఎం అంటే ఎగ‌స్ట్రా వేషాల ముఠా. ప్ర‌ధానంగా కొడాలి నాని, వంశీ, అంబ‌టి, రోజా స‌భ్యులుగా వున్న ఈ ముఠా జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం చూడ‌డానికి…

జ‌గ‌న్ ఈవిఎంల వ‌ల్ల ఓడిపోయిన మాట నిజ‌మే. ఈవిఎం అంటే ఎగ‌స్ట్రా వేషాల ముఠా. ప్ర‌ధానంగా కొడాలి నాని, వంశీ, అంబ‌టి, రోజా స‌భ్యులుగా వున్న ఈ ముఠా జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం చూడ‌డానికి నోటికొచ్చింది మాట్లాడింది. కుళాయి నీళ్ల‌లా బూతులు ప్ర‌వ‌హించాయి. జ‌గ‌న్ వారిస్తే కొంత న‌ష్ట నివార‌ణ జ‌రిగేది. ఆ ప‌ని చేయ‌లేదు. ఐదేళ్లు క్వారంటైన్‌. వాక్సిన్ లేదు, రాదు.

పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్టు , తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చీరాగానే ఈవిఎం మొద‌లైంది. జ‌గ‌న్ చ‌చ్చిపోలేద‌ని అయ్య‌న్న‌, ప‌చ్చ‌బిళ్ల త‌గిలించుకుని అధికారుల‌తో తొక్కుడు బిళ్ల ఆడించాల‌ని అచ్చెన్నాయుడు ఒక‌వైపు మాట్లాడుతూ వుండ‌గా జెసి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నాలుగాకులు ఎక్కువ చ‌దివి తిట్ల పురాణం ప్రారంభించాడు.

జెసి బ్ర‌ద‌ర్స్‌లో దివాక‌ర్‌రెడ్డిది జాగ్ర‌త్త‌గా మాట్లాడే స్వ‌భావం. ఒక‌ప్పుడు ఆయ‌న‌కి దురుసు వున్నా, క్ర‌మేపి త‌గ్గించుకున్నాడు. అయితే ప్ర‌భాక‌ర్‌రెడ్డి దురుసు, దూకుడు. తాడిప‌త్రి వ‌ర‌కూ చెల్లింది కానీ, బ‌య‌ట క‌ష్టం. హైద‌రాబాద్ ఆర్టీవో అధికారుల్ని బెదిరించి వార్త‌ల్లోకి ఎక్క‌డం తెలిసిందే.

కాలం ఎపుడూ ఒక‌రి వైపే వుండ‌దు. జ‌గ‌న్‌ని అరేఓరే అని తిట్టిన ఫ‌లితం కేసుల రూపంలో చుట్టుకుంది. బ‌స్సులు ఆగిపోయాయి. త‌న‌ని జైలుకి పంపార‌నే క‌క్ష‌తో చంద్ర‌బాబునే జైలుకి పంపాడు జ‌గ‌న్‌. ఇక ప్ర‌భాక‌ర్‌రెడ్డిదేముంది. న్యాయ‌మా అన్యాయ‌మా అనేది కోర్టుల్లో తేలుతుంది. అది ప‌క్క‌న పెడితే బుధ‌వారం ప్రెస్‌మీట్ పెట్టిన జెసి , అధికారుల్ని న‌రుకుతాన‌ని హెచ్చ‌రించాడు. కొడ‌తాన‌ని బెదిరించాడు.

త‌న‌పై కేసులు పెట్టిన ర‌వాణా అధికారి శివ‌ప్ర‌సాద్‌ని ఎక్క‌డున్నా వ‌ద‌ల‌న‌ని అన్నాడు. అటికా అనే మ‌హిళా అధికారిని ఆడ‌ది అని అన్నాడు. దీని మీద చంద్ర‌బాబు చ‌ర్య తీసుకుంటాడా లేదా జ‌గ‌న్‌లా చూసీచూడ‌న‌ట్టు వుంటాడో తెలియ‌దు. కానీ జ‌నం అన్నీ చూస్తూ వుంటారు.

వైసిపి నాయ‌కుల నోటి దుర‌ద‌కి రోత పుట్టి టిడిపిని గెలిపిస్తే వీళ్లు కూడా అదే రాగం ఎత్తుకుంటున్నారు.

రాష్ట్ర అధికారుల్నే న‌రుకుతాన‌ని హెచ్చ‌రించిన జెసి ప్ర‌భాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రిలో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాడో అంద‌రికంటే తాడిప‌త్రికే బాగా తెలుసు. మొత్తం మీద టిడిపికి వేరే శ‌త్రువులు అక్క‌ర‌లేదు. అనుకూల శ‌త్రువుల సంఖ్య‌ని పెంచుకుంటున్నారు.