అయ్యన్న ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు బాబూ!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువుతీరనుంది. 24 వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తర్వాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువుతీరనుంది. 24 వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తర్వాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేయడం, స్పీకరు, డిప్యూటీ స్పీకరులను ఎన్నుకోవడం వరకు పరిమితం కానున్న ఈ శాసనసభా సమావేశాలు మూడురోజులు మాత్రమే జరుగుతాయి. కాగా, స్పీకరుగా చింతకాయల అయ్యన్నపాత్రుడును ఎన్నుకోనున్నట్టుగా తెలుస్తోంది.

చింతకాయల అయ్యన్నపాత్రుడును ఎంతో గౌరవప్రదమైన సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రాష్ట్రానికి ఏం సంకేతాలు ఇవ్వదలచుకుంటున్నారు? రాజకీయాల్లో ఏ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని అనుకుంటున్నారు? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.

స్పీకరు స్థానం అనేది చాలా ఉన్నతమైనది. రాజ్యాంగబద్ధమైనది, గౌరవప్రదమైనది కూడా. ఆ స్థానంలో ఉండే నాయకుడికి హుందాతనం కూడా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడి సంగతేమిటి? సీనియారిటీ విషయంలో ఆయనకు తిరుగులేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. అయితే హుందాగా ఉండే నాయకుడేనా అని అంటే.. ఆ పార్టీ వారు కూడా అవునని చెప్పలేరు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నానిని స్పీకరు చేసి ఉంటే ఎలా ఉండేదో.. తెలుగుదేశం చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకరు చేయడం అలాంటి నిర్ణయమే. బూతులు తిట్టడంలో, రాయడానికి కూడా వీలులేని, వినడానికి కూడా సిగ్గుపడే భాషతో చెలరేగిపోవడంలో వైసీపీలో కొడాలి నానికి దీటైన నాయకుడు తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే.. ముందుగా అయ్యన్నపాత్రుడి పేరే చెప్పుకోవాలి. మరి అలాంటి నాయకుడిని స్పీకరుగా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబునాయుడు ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నారు.. అనేది చర్చనీయాంశమే కదా.

వైసీపీ నాయకులను తిరిగి మాట్లాడడానికి వీల్లేని విధంగా.. స్పీకరుతోనే తిట్టించదలచుకున్నారా? అని నాయకులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశంలో ఇంకా చాలా మంది సీనియర్లు, స్పీకరు పదవిని ఆశిస్తున్న వారు ఉన్నప్పటికీ.. ప్రత్యేకంగా అయ్యన్నను ఎంచుకోవడం.. చంద్రబాబు నాయుడు చాణక్యమేనని వ్యాఖ్యానిస్తున్నారు.