నిజంగా ఇది ఆశ్చర్యకర పరిణామం. చంద్రబాబు కేబినెట్ ఏర్పడి గట్టిగా వారం కూడా గడవలేదు. ప్రజా పరిపాలన ఏర్పడిందని చంద్రబాబు గొప్పగా చెబుతుండగా, మరోవైపు ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ప్రజాసంఘాల ఆందోళన. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు రోజులకే ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో ఏపీలో మానవ హక్కుల హననంపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశాన్ని అధికారం కోల్పోయిన వైసీపీ ఏర్పాటు చేసింది కాదు. సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నేతలు ఏపీలోని రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ చెలరేగిందని, బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు హెచ్చుమీరాయని ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ఏపీలో మానవ హక్కుల్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిని ప్రజాసంఘాలన్నీ కలిసి ఏర్పాడు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సంఘాలన్నీ కలిసి ఎన్నికల హింసను, బడుగు, బలహీన వర్గాలపై దాడుల్ని అరికట్టాలని నిర్ణయించడాన్ని కూటమి చిన్న విషయంగా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి వారం కూడా గడవకనే ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడం ముఖ్యంగా చంద్రబాబునాయుడికి మంచిది కాదు.
బడుగు, బలహీనవర్గాల వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడితే, ఆ మచ్చను పోగొట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రభుత్వం అణగారిన వర్గాల్లో వ్యతిరేకతకు ఇది బీజం వేసినట్టు అవుతుంది. కావున హింసను ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం అరికట్టాలి. ఇంకా సమర్థించుకునేలా వ్యవహరిస్తే, రానున్న రోజుల్లో నష్టపోవాల్సిందే తామే అని గ్రహించాల్సి వుంటుంది.