సెలబ్రిటీల్ని డీప్ ఫేక్ వణికిస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ డీప్ ఫేక్ వ్యవహారాలు మాత్రం ఆగలేదు. తాజాగా హీరోయిన్ అలియా భట్ మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది.
“గెట్ రెడీ విద్ మి” ట్రెండ్ లో భాగంగా ఓ అగంతకుడు అలియా భట్ ముఖాన్ని డీప్ ఫేక్ చేశాడు. నలుపు రంగు కుర్తా వేసుకొని, మేకప్ వేసుకుంటున్న అమ్మాయిని అలియా భట్ గా చూపించాడు. వీడియో బయటకొచ్చిన వెంటనే నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ పనులు మానేయాలని సూచిస్తున్నారు.
డీప్ ఫేక్ బారిన పడడం అలియాకు కొత్తేం కాదు. నటి వామికా గాబి హాట్ గా ఉన్న వీడియోకు అలియా భట్ ముఖాన్ని తగిలించి ఓ వీడియో తయారుచేశారు గతంలో. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ అసభ్యకరమైన పోజుకు అలియా భట్ ఫేస్ తగిలించి డీప్ ఫేక్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐను దుర్వినియోగం చేయడం రానురాను కామన్ గా మారిపోతోంది. డీప్ ఫేక్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు జరిమానా, మూడేళ్లు జైలుశిక్ష విధించేలా చట్టాలు రూపొందించారు. అయినప్పటికీ ఈ సంస్కృతి ఆగడం లేదు. ఏఐతో ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి.