చంద్రబాబు ప్రభుత్వంలో మనుగడ లేదని గ్రహించిన కొంత మంది సీనియర్ అధికారులు రాజీనామా బాట పట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ దేవాదాయశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా రాజీనామా చేశారు. గతంలో ఈయన పదవీ విరమణ చేసినప్పటికీ, జగన్ ప్రభుత్వం ఆయన్ను కొంత కాలం కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మరో నెలన్నర పాటు ఆయనకు పదవీ కాల గడువు వుంది.
అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇంకా ఆ పదవిలో కొనసాగడం గౌరవం కాదని భావించిన కరికాల వలవన్… తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు తిరుమలకు వెళ్లిన సందర్భంలో కరికాల వలవన్ అక్కడికెళ్లి స్వాగతం పలికారు. అలాగే టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి లీవ్ మంజూరు చేయడం, కొత్త ఈవోగా శ్యామలారావుకు ఆదేశాలు ఇచ్చే వరకే కరికాల వలవన్ను పరిమితం చేశారు.
కొత్త ప్రభుత్వం నుంచి అవమానాలు ఎదురు కాకుండానే వైదొలగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవమానాలు తప్పలేదు. ఆ అనుభవాల్ని చూసి, ఆయన తప్పుకున్నారని తెలిసింది.
ఇదిలా వుండగా కరికాల వలవన్ వైసీపీ తరపున ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. అందుకే ఆయనపై కొత్త ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా కన్నేశారని సమాచారం.