టీడీపీలో అత్యంత కీలక నాయకుడు నారా లోకేశ్. ఆ పార్టీకి భవిష్యత్ వారసుడు ఆయనే. అందుకే ఆయన రాజకీయంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జగన్ ఘోర పరాజయాన్ని చూసి బహుశా టీడీపీ నేతల్లో కూడా వణుకు పుట్టినట్టుంది. కార్యకర్తలు, ప్రజలకు దూరమైతే, ఏమవుతుందో జగన్ ఓటమిని వారంతా గుణపాఠంగా తీసుకుంటున్నారు. అందుకే అధికారంలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్‌కు, ప్రజలకు మాత్రం దూరం కాకూడదని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టుంది.
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. వరుసగా రెండోరోజు ఆయన ప్రజాదర్భార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయనకు సంబంధించి అప్డేట్ తెలిసింది. మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన లోకేశ్, ఇకపై స్థానిక ప్రజలకు అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మినహా, మిగిలిన సమయాల్లో ప్రతిరోజూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని లోకేశ్ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇప్పటికే లోకేశ్ ప్రజాదర్బార్ పేరుతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సమస్యల పరిష్కారం సంగతి పక్కన పెడితే, ముందుగా తమ గోడు చెప్పుకోడానికి పాలకులు అందుబాటులో వుండాలని కోరుకుంటారు.
సీఎం హోదాలో జగన్ ఆ కీలక విషయాన్ని విస్మరించారు. అందుకే సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు మద్దతుగా నిలవలేదని ఘోర పరాజయం నిరూపించింది. జగన్ ఓటమిని చూసి, ప్రజలకు అందుబాటులో లేకపోతే తమకు కూడా అదే గతి పడుతుందనే భయం పట్టుకుంది. అప్రమత్తమైన నాయకులకు భవిష్యత్ వుంటుంది.