గ్రామీణం మొదలుకుని రాష్ట్ర స్థాయి వైసీపీ నాయకుల వరకూ కేసుల పేరుతో టీడీపీ భయపెడుతోంది. ఫలానా పనిలో మీరు అవినీతికి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, జైలు కోసం ఎదురు చూడాలంటూ వైసీపీ నాయకులకు టీడీపీ నేతలు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. టీడీపీ ముఖ్య నాయకులు కూడా అండదండలు ఇస్తుండడంతో ఇక పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారి విషయంలో కేసులు పెట్టినా ఎవరికీ బాధ లేదు. అయితే ఎలాంటి అవకతవకలకు పాల్పడని వారినీ వదల పెట్టకుండా, కేసులంటూ భయపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ వేధింపులు పైకి కనిపించనవి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రత్యర్థులపై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
వీటిపై వైసీపీ న్యాయ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. న్యాయ స్థానం డైరెక్షన్స్ ఎలా ఉన్నా, అంతిమంగా చర్యలు తీసుకోవాల్సింది ఏపీ పోలీస్ అధికారులే. అధికార పార్టీ ఆదేశాల్ని కాదని, పోలీసులు చేసేదేమీ లేదు. కావున అధికార పార్టీ దాడులకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు.
వైసీపీ ప్రభుత్వంలో పనులకు సంబంధించి కేసుల పేరుతో బెదిరింపుల వెనుక ఆసక్తి విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసులు వరకూ వెళ్లొద్దని అనుకుంటే, భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పాలనే షరతులు విధిస్తున్నారని తెలిసింది. మరోవైపు చంద్రబాబునాయుడు నేటి నుంచి ప్రజా పరిపాలన మొదలైందని చెప్పడం గమనార్హం. అధికారంలో ఎవరున్నా, తమ ఏలుబడిలో అంతా రామరాజ్యంగానే కనిపిస్తుంటుంది. నిన్నమొన్నటి వరకు జగన్‌కు కూడా ఇట్లే కనిపించింది. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది.