అయిదేళ్ల పాలన ముగిసింది. ఎన్నికలు ముగిసాయి. భవిష్యత్ మాత్రమే ముందు వుంది. ఆ భవిష్యత్ లో కనిపిస్తున్న సవాలు.. ఆర్ధిక వనరులు ఎలా సమకూరుతాయి అన్నది. అయిదేళ్ల పాటు బటన్ నొక్కుతూ లబ్దిదారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తూ వచ్చారు సిఎమ్ జగన్. అదే సమయంలో కుదిరిన మేరకు అభివృద్ది మీద ఎంతో కొంత దృష్టి పెట్టారు. ఒక్కోటీ అయిదు వందల కోట్ల వంతున మెడికల్ కాలేజీల నిర్మాణం తలకెత్తుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయింది. వాటికి సదుపాయాల కల్పన మిగిలింది.
ఇలాంటి నేపథ్యంలో అందిన కాడికి, అయిన మేరకు అప్పులు తెచ్చారు. తెస్తూనే వున్నారు. అందులో దాపరికం ఏమీ లేదు. ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్నీ చేసి మరీ అప్పులు తెచ్చారు. 2019 కి ముందు చంద్రబాబు సైతం చేసింది అదే. స్పెషల్ పర్సస్ వెహికిల్ అని, కార్పొరేషన్లు అన్నీ కొత్త కొత్త మార్గాలు అన్వేషించి అప్పులు తెచ్చారు అప్పట్లో. అలాగే మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయించి, వాటిని మళ్లించి, పసుపు కుంకుమ పంచారు.
ఇదే మార్గాన్ని మరింత విస్తృతం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు జగన్. అప్పులు పెరిగాయి అన్నది పక్కన పెడితే కొత్త అప్పులు పుట్టే పరిస్థితి రాను రాను తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ఇలాంటి టైమ్ లో అటు జగన్ నో ఇటు చంద్రబాబునో పవర్ లోకి రాబోతున్నారు మరో పక్షం రోజుల్లో. అప్పుడేంటీ అన్నది పాయింట్.
జగన్ అధికారంలోకి వస్తే, ఇప్పటికే పెండింగ్ లో పెట్టిన పదివేల కోట్ల బటన్ నిధులు విడుదల చేయాలి. రెగ్యులర్ గా అందించేవి అందించాలి. మిగిలిన ఖర్చులు వుండనే వుంటాయి. వీటన్నింటికీ మళ్లీ అప్పులు తేవాల్సిందే. ఎలా? ఎలా? అన్నది క్వశ్చను. పైగా ఇప్పటి వరకు కేంద్రం నుంచి సహాయం అందింది అప్పులు పుట్టించడానికి. కానీ ఇకపై అలా వుంటుందా? అలా వుండకపోతే పరిస్థితి ఏమిటి? ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో ఎన్ డి ఎ కు భాగస్వామి లేదు. ఇప్పుడు వుంది. అందువల్ల అప్పటి సహాయం ఇప్పటికీ కొనసాగుతుందని అనుకోవడానికి లేదు.
ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అదృష్టం ఏమిటంటే ఈసారి అయినా మోడీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందనే ఆశ. 2014 నుంచి 2019 వరకు అది అందలేదు. అందుకే బాబు దూరం అయింది. ఈసారి కేంద్ర సహకారం అందుతుంది అనుకున్నా కళ్ల ముందు ఖర్చులు భారీగా కనిపిస్తున్నాయి. జూలైలో వృద్దాప్య పింఛన్లు ఎరియర్స్ తో సహా ఇవ్వాల్సి వుంది. బస్ ఫ్రీ అమలు చేయాలి. అంటే ఆర్టీసీకి భర్తీ చేయాలి. కరెంట్ బిల్లులు వగైరా చార్జీలు తగ్గించడం అవన్నీ పక్కన పెడితే జగన్ అమలు చేసిన పథకాలు మరింత ఎక్కువగా అమలు చేయాలి. ఏమాత్రం గ్యాప్ వచ్చినా జనం అసంతృప్తికి లోనవుతారు.
సంపద సృష్టిస్తా అని చంద్రబాబు చెప్పడం, తెలుగుదేశం జనాలు దాన్ని తందాన తానా అంటున్నారు. కానీ సంపద సృష్టి రాత్రికి రాత్రి జరిగిపోదు. నిజంగా చంద్రబాబుకు ఆ విద్య వచ్చు అనుకున్నా , ఫలితాలు ఇవ్వడానికి కనీసం మూడేళ్లు పడుతుంది. అది కూడా చార్జీలు పెంచకుండా.
జగన్ భూములు అమ్ముతాం అంటే కోర్టు ద్వారా అడ్డం పడ్డారు. ఆ తీర్పులు అన్నీ పదిలంగా అలాగే వున్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు అమ్మినట్లు అమ్ముదాం అంటే ఈసారి వైకాపా కనుక లీగల్ గా వెళ్తే అవే తీర్పులు అడ్డం పడే ప్రమాదం వుంది. నీవు నేర్పిన విద్యే అన్నట్లు వైకాపా కనుక ప్రతిపక్షంలో వుండి తేదేపా కు అడ్డం పడుతూ వుంటే అన్నీ ఆలస్యం అవుతూ వస్తాయి. దీనికి తోడు కేంద్రం నుంచి ఏ మాత్రం సహకారం లేకపోయినా ఇబ్బందే.
మొత్తం మీద అటు జగన్ గెలిచినా, ఇటు బాబు గెలిచినా, ముందు వుంది ముసుర్ల పండగ అన్నట్లు వుంది ఆంధ్ర పరిస్థితి. (ముందు వుంది మొసళ్ల పండుగ అన్నది మారిపోయిన లైన్.. అసలు లైన్ ఇదే.. ముసురు అంటే వర్షం.. పండగ టైమ్ లో వర్షం పడితే ఇబ్బంది అనే మీనింగ్ అక్కడ)