కొంపముంచనున్న క్రాస్ ఓటింగ్?

జమిలి ఎన్నికలు జరిగినపుడల్లా ఇదే సమస్య వస్తుంది. పైగా ఓటర్లు చాలా నిజాయితీపరులు. ప్రలోభాలకు లొంగినా అందరికీ న్యాయం చేద్దామనుకునే రకాలు. దాంతో ఒక ఓటు ఎంపీ ఒక ఓటు ఎమ్మెల్యేకి అన్న నీతిని…

జమిలి ఎన్నికలు జరిగినపుడల్లా ఇదే సమస్య వస్తుంది. పైగా ఓటర్లు చాలా నిజాయితీపరులు. ప్రలోభాలకు లొంగినా అందరికీ న్యాయం చేద్దామనుకునే రకాలు. దాంతో ఒక ఓటు ఎంపీ ఒక ఓటు ఎమ్మెల్యేకి అన్న నీతిని పాటించారు అని అంటున్నారు.

దాంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందో అన్న టెన్షన్ ఎంపీ అభ్యర్ధులకు పట్టుకుంది. విశాఖ అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులు అందరికీ ఈ సమస్య ఉంది అని పోలింగ్ తరువాత ఆయా పార్టీలు చేసుకున్న మధింపులో తెలిసినట్లుగా చెబుతున్నారు.

రెబెల్స్ ని సముదాయించిన చోట బయటకు నవ్వుతూ కనిపించినా చేయాల్సింది చాప కింద నీరుగా చేసుకుని పోయారని దాని వల్ల వారి అనుచరులు ప్రత్యర్ధి పార్టీలకు ఓటు వేసి మమ అనిపించారని అంటున్నారు. ఈ దెబ్బతో కూడా విజయం ఎవరిని వరిస్తుందో తెలియని విధంగా ఉందిట. క్రాస్ ఓటింగ్ కి పెట్టింది పేరుగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ సీటులో ఈసారి కూడా అలాగే జరిగింది అని అంటున్నారు. దాంతో బలి అయ్యేది ఎవరా అన్న దాని మీద రెండు ప్రధాన పార్టీలలో తర్కించుకుంటున్నారు.

విజయనగరం ఎంపీ సీటు విషయంలో కూడా ఇలాగే జరిగింది అని అంటున్నారు. ఎంపీ అభ్యర్థుల సొంత ఊళ్ళలో వారి మీద అభిమానంతో ప్రత్యర్థి పార్టీల నుంచి ఓట్లు బాగానే పడ్డాయని అంటున్నారు. దీంతో ఫలితం ఎక్కడ తేడా కొడుతుందో అర్ధం కాని స్థితి ఉంది.

విశాఖ ఎంపీ సీటు విషయంలోనూ క్రాస్ ఓటింగ్ ప్రభావం బాగా ఉంది అని అంటున్నారు. అది ఎవరికి శాపం ఎవరికి వరం అన్నది ఇప్పట్లో తేలే లెక్క కాదని కౌంటింగ్ లోనే చూడాలని అంటున్నారు. అనకాపల్లిలో ఒక అభ్యర్ధి లక్ష మెజారిటీ అన్నారు. మరో అభ్యర్ధి రెండు లక్షలు అన్నారు. కానీ క్రాస్ ఓటింగ్ భారీగా దెబ్బ తీసింది అని అంటున్నారు. దాంతో ఒక ప్రధాన పార్టీలో పోలింగ్ ముగిసిన తొలి రోజు కనిపించిన ఉత్సాహం రెండవ రోజుకే మాయం అయింది అని అంటున్నారు. ఇలా చూస్తే క్రాస్ ఓటింగ్ లీలలు ఎవరికి ఎర్త్ పెట్టనున్నాయన్నది ఈవీఎంలు విప్పితే కానీ తెలియదు అంటున్నారు.