తమ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకున్నారు. మొదటి రోజు కోటి వచ్చిందన్నారు. వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ అయినట్టు ప్రకటించుకున్నారు. కట్ చేస్తే, ఎనౌన్స్ చేసిన మరుసటి రోజునే ఓటీటీలో ప్రత్యక్షమైంది కృష్ణమ్మ సినిమా.
అవును.. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా వారం తిరిగేసరికి ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది. నిజంగా సినిమా హిట్టయితే, వారంలోనే ఓటీటీకి రాదు కదా.
ప్రస్తుతం థియేట్రికల్ సిస్టమ్ ఏం బాగాలేదు. ఎండలు, ఐపీఎల్, ఎన్నికలు కారణంగా థియేటర్లలో జనం పూర్తిగా తగ్గిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వచ్చిన కృష్ణమ్మ సినిమా నిలబడలేకపోయింది. దీనికితోడు మంచి కాన్సెప్ట్ ను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం, క్లయిమాక్స్ తేలిపోవడం సినిమాకు మైనస్ గా మారింది.
పైగా విడుదలైన వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఇచ్చేసేలా నిర్మాతలు ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ ఎగ్రిమెంట్ ప్రకారమే కృష్ణమ్మ సినిమా వారానికి ఓటీటీలోకి వచ్చేసింది.
అయితే ఇంత త్వరగా ఓటీటీలోకి వస్తే విమర్శలు వస్తాయని మేకర్స్ భావించినట్టున్నారు. మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి ఓటీటీలోకి వదిలేశారనే కామెంట్స్ వస్తాయని భయపడ్డారు. పైగా కొరటాల శివ ప్రజెంట్ చేసిన సినిమా ఇది. అందుకే సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అయిందంటూ ప్రెస్ నోట్ వదిలారు. సినిమా హిట్టని చెప్పుకున్నారు. ఆ వెంటనే ఓటీటీలోకి వదిలారు. అదీ సంగతి.