ఉత్తరాంధ్రలో వైసీపీ గెలిచే సీట్లు అవే!

ఉత్తరాంధ్రలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఉత్తరాంధ్రను 2019 ఎన్నికల్లో వైసీపీ కైవశం చేసుకుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఆ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతు…

ఉత్తరాంధ్రలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఉత్తరాంధ్రను 2019 ఎన్నికల్లో వైసీపీ కైవశం చేసుకుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఆ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతు పలికాయి. విజయనగరం జిల్లా అయితే క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పదింటికి ఎనిమిది, విశాఖలో పదిహేనుకు పదకొండు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ పరం అయ్యాయి. ఈసారి కూడా దాని కంటే ఒకటి ఎగస్ట్రా గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 34 సీట్లూ గెలుచుకుంటామని వై నాట్ 175 ప్రకారం ఉత్తరాంధ్ర నుంచే వైసీపీ జైత్రయాత్ర మొదలవుతుందని అన్నారు. మొత్తం అన్ని సీట్లూ గెలుచుకుంటామన్న ధీమా తమకు ఉందని ఆయన చెప్పారు.

విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని బొత్స చెప్పారు. వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో విశాఖను రాజధానిగా చేస్తామని పెట్టామని గుర్తు చేసారు. ఈ మేరకు ప్రజా తీర్పు తమకు అనుకూలంగా వస్తోందని అన్నారు. తెలుగుదేశం విశాఖ రాజధాని అన్న అంశాన్ని తన ఎన్నికల హామీలో పెట్టలేకపోయింది అని బొత్స విమర్శించారు.

ప్రజా తీర్పు తరువాత విశాఖను పాలనా రాజధానిగా చేసుకోవడం కోసం కోర్టులలో కూడా సానుకూల తీర్పు కోరతామని బొత్స అన్నారు. రుషికొండ మీద కొత్తగా కట్టిన భవనాలను ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగానా లేక ముఖ్యమంత్రి నివాసం గానా అన్నది తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు. 

తెలుగుదేశం భ్రమలలో బతుకుతున్న పార్టీ అని గెలుస్తామని వారు చెప్పుకుంటే చెప్పుకోనీయండి అని బొత్స ఎద్దేవా చేశారు.  ఫలితాలు వచ్చిన తరువాత వాస్తవాలు వారికి అర్ధం అవుతాయని అన్నారు. నిజంగా టీడీపీకి తమ గెలుపు మీద ధీమా ఉంటే మహానాడుని ఎందుకు రద్దు చేసుకున్నారని బొత్స ప్రశ్నించారు.