ప్రజలను బురిడీ కొట్టించేందుకే ఆ మాటలు!

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ కూడా వారికి బయటి నుంచి మద్దతు ఇస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీదీ పేర్కొన్నటువంటి మాటలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చిత్రంగా ధ్వనిస్తున్నాయి. Advertisement…

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ కూడా వారికి బయటి నుంచి మద్దతు ఇస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీదీ పేర్కొన్నటువంటి మాటలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చిత్రంగా ధ్వనిస్తున్నాయి.

ఎందుకంటే.. ఎవరికైతే మద్దతు ఇచ్చి అధికారపీఠంపై కూర్చోవడానికి సహకరిస్తానని మమతా ఇప్పుడు ప్రకటిస్తున్నారనో.. అదే కూటమితో ఆమె విభేదించి.. బెంగాల్ వ్యాప్తంగా వారిని కూడా తన ప్రదాన ప్రత్యర్థులుగా భావిస్తూ ఎన్నికల సమరంలో తలపడుతున్నారు. ఇప్పుడు వారిని ఓడించడానికి ప్రయత్నిస్తూ, ఫలితాల తర్వాత వారికి మద్దతిచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తాను అనడం కామెడీ కాక మరేమిటి?

అయితే మమతా బెనర్జీ ఇలా.. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడేట్లయితే బయటినుంచి మద్దతు ఇస్తాననడం కేవలం.. బెంగాల్ లోని ప్రజలను మాయ చేయడానికి, అక్కడ కాంగ్రెసుకు పడగల ఓట్లను తనవైపు తిప్పుకోవడానికి ఒక ఎత్తుగడ మాత్రమే అనే అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇండియా కూటమి ఏర్పడడానికి తొలుత ఎంతో కీలకంగా వ్యవహరించిన దీదీ అంతే తొందరగా కూటమిలోంచి బయటకు వచ్చారు. బెంగాల్ లో కాంగ్రెసులో సీట్లు పంచుకోవడంలో ఆమెకు లెక్కలు కుదర్లేదు. దాంతో కూటమినే విడిచిపెట్టారు. ఆ విషయంలో ఆమె ఒంటెత్తు పోకడలను ఇండియా కూటమి కూడా లైట్ తీసుకుంది.

ఇప్పుడు సీపీఎం, కాంగ్రెస్ కలిసి బెంగాల్ మొత్తం పోటీచేస్తున్నాయి. అక్కడ ఇంకా సగానికి పైగా స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. పోటీ త్రిముఖం కావడం వలన.. భాజపా వ్యతిరేక ఓటు చీలుతుందేమో అనే భయం మమతా దీదీకి ఇప్పుడు కలిగినట్టుంది. అందుకే కాంగ్రెసును కోరుకునే వాళ్లు కూడా ఓటు నాకే వేయండి.. నేను గెలిచినా ఆ కూటమికే మద్దతిస్తాను అని ఓటర్లను భ్రమింపజేయడానికి ఆమె ఈ మాటలు అన్నట్టుగా కనిపిస్తోంది. ఆ మాటలు ప్రజలు నమ్మితే కాంగ్రెసుకే ఎక్కువ నష్టం.

అందుకే ఆ పార్టీ నేతలు ముందుగానే మేలుకొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ‘దీదీ మాటలు నమ్మడానికి వీల్లేదని, ఆమె కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కూడా మద్దతు ఇవ్వగలరని’ ఆయన అంటున్నారు. దీదీ మాటలు బెంగాల్ లో తమ విజయావకాశాలను దెబ్బకొట్టకుండా ఆయన జాగ్రత్త  పడుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ.. ఇండియా కూటమి, తృణమూల్ కాంగ్రెస్ ఒకరిమీద మరొకరు అపనమ్మకం కలిగించుకునే విధంగా ప్రకటనలు చేయడం వల్ల.. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా అక్కడ భారతీయ జనతా పార్టీ లాభపడవచ్చునని పలువురు భావిస్తున్నారు.