థియేటర్లు మూతపడుతుంటే ‘ఫేక్’ అంటారా!

ఇండస్ట్రీలో అంతే. ఎవరి స్వార్థం వాళ్లది, ఎవరి బిజినెస్ వాళ్లది. పక్కోడు మునిగిపోతుంటే చోద్యం చూస్తారు. తమ వరకు వచ్చేసరికి గగ్గోలు పెడతారు. కలిసి తీసుకున్న నిర్ణయాల్ని తామే తుంగలో తొక్కుతుంటారు. ఇక్కడ ఎవడికి…

ఇండస్ట్రీలో అంతే. ఎవరి స్వార్థం వాళ్లది, ఎవరి బిజినెస్ వాళ్లది. పక్కోడు మునిగిపోతుంటే చోద్యం చూస్తారు. తమ వరకు వచ్చేసరికి గగ్గోలు పెడతారు. కలిసి తీసుకున్న నిర్ణయాల్ని తామే తుంగలో తొక్కుతుంటారు. ఇక్కడ ఎవడికి వాడే బాసు.

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఆక్యుపెన్సీ పూర్తిగా తగ్గిపోయింది. ఫుట్ ఫాల్ కనిష్ఠ స్థాయికి చేరింది. కారణాలేవైనా సింగిల్ స్క్రీన్స్ లో జనం కనిపించడం లేదు. దీంతో నష్టాల్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల పాటు థియేటర్లు మూసేయాలని సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆల్రెడీ ఈ నిర్ణయం కొన్ని చోట్ల అమల్లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో పలు చోట్ల స్క్రీన్స్ మూతపడ్డాయి. తెలంగాణలో దాదాపు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ మూసేయాలని నిర్ణయించుకున్నారు. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు నిర్మాతల మండలి మాత్రం చోద్యం చూస్తోంది. రూల్స్ మాట్లాడుతోంది, పైగా ఫేక్  అంటోంది.

ఐపీఎల్, ఎన్నికల కారణంగా పలు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందంటూనే, ఎవ్వరూ తమకు నోటీసులివ్వలేదని బుకాయిస్తోంది ఫిలింఛాంబర్. అలా నోటీసులు ఇవ్వలేదు కాబట్టి థియేటర్ల బంద్ అనేది వీళ్ల దృష్టిలో ఫేక్. ఇది మేం చెబుతున్నది కాదు, స్వయంగా వాళ్లు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఫేక్ అనే పదం ఉంది.

ఇండస్ట్రీలో ఓ సమస్య ఉత్పన్నమైనప్పుడు నోటీసులిచ్చేవరకు ఎదురుచూడాలా? ఓవైపు తగలబడిపోతుంటే ఫైరింజన్ వచ్చేవరకు చూస్తూ కూర్చోవాలా? పరిశ్రమలో పెద్ద సంస్థగా చెప్పుకున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా.

కలెక్షన్లు లేకపోవడం వల్ల కొందరు థియేటర్ యాజమాన్యాలు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయంగా దీన్ని కొట్టిపారేస్తోంది నిర్మాతల మండలి. మరి కలెక్షన్లు లేకపోవడానికి కారణం ఎవరు? మినిమం గ్యాప్ లో మంచి సినిమాలు రిలీజ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇలా చూసీచూడనట్టు వదిలేస్తే, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూతపడితే దానికి ఎవరు బాధ్యలు?

ఎవరికో నష్టాలొచ్చాయి కాబట్టి క్లోజ్ చేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. ఇదే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే సింగిల్ స్క్రీన్స్ తెరుస్తారు. చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు మూసిపెడతారు. ఇదే జరిగితే ఇండస్ట్రీ ఏం కావాలి? ఇవన్నీ ఆలోచించరా?

మరో వారం రోజుల్లో దిల్ రాజు నిర్మించిన లవ్ మీ సినిమా రిలీజ్ అవుతోంది. అప్పటికి మరిన్ని థియేటర్లు మూతపడితే ఇలానే మాట్లాడతారా?