అమెరికాలో తానా సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉన్నత చదువులు అభ్యసించి, ఉపాధి కోసం అమెరికా వచ్చినా తెలుగు తమ్ముళ్లు తన్నుకోవడం ఆపలేదని, వీరి వల్ల తెలుగు సమాజానికే చెడ్డపేరు వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ల గొడవకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడమే కారణం కావడం గమనార్హం.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో 23వ తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంఘం టీడీపీకి అనుబంధం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తానా సభల ప్రారంభోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ , సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సభలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు. వీరిలో ఎక్కువగా టీడీపీ నేతలున్నారు. సభా ప్రాంగణంలో ఒక్కసారిగా అలజడి చెలరేగడంతో ఆహ్వానితులంతా ఆందోళనకు గురయ్యారు. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. చొక్కాలు పట్టుకుని ఈడ్చుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. చేతులతో పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దృశ్యాల్ని చూస్తున్నవారంతా ఏమవుతుందోననే భయాందోళనకు గురయ్యారు.
చాలా సేపటి వరకూ గొడవ జరుగుతూ వుంది. అసలు ఈ గొడవకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కారణమని ఒక వర్గం వారు చెబుతున్నారు. సభ జరుగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని… తన ఆరాధ్య టాలీవుడ్ హీరో పేరు ప్రస్తావిస్తూ జై కొట్టడంతో గొడవ ప్రారంభమైంది.
తానా సభలో జై ఎన్టీఆర్ అనడాన్ని తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం పెట్టారు. దీంతో టీడీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నట్టు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉనికిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జీర్ణించుకోలేని సంగతి తెలిసిందే. చివరికి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, అమెరికాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినడానికి తెలుగు తమ్ముళ్లు సహించకపోవడం గమనార్హం.