టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి తన అసంతృప్తిని బయట పెట్టారు. గతంలో విజయవాడ వెస్ట్ సీటును ఆయన ఆశించారు. అయితే ఆ సీటును బీజేపీ సీనియర్ నాయకుడు సుజనాచౌదరికి ఇచ్చారు. సుజనా ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుజనా తనకిష్ట ప్రకారం ఉద్యోగుల్ని నియమించుకుంటున్నారు. దీన్ని బుద్ధా వెంకన్న జీర్ణించుకోలేకపోతున్నారు.
మనసులో గూడు కట్టుకున్న ఆవేదనంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టిన రోజు వేడుక సందర్భంగా ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. బుద్ధా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. గతంలో వైసీపీ హయాంలో టీడీపీ కోసమే 37 కేసులు పెట్టించుకున్నట్టు గుర్తు చేశారు. ఎమ్మెల్యే పదవి వుంటేనే మాట చెల్లుబాటు అవుతుందని ఈ ఎన్నికల్లో తెలిసిందన్నారు.
పదవి లేకపోవడంతో తనను నమ్ముకున్న వారికీ ఏమీ చేయలేకపోతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమకు ఇష్టమైన వారిని సీఐలుగా నియమించుకున్నారని చెప్పారు. తన మాట ఎవరూ పట్టించుకోలేదన్నారు. తానే ఇతరులపై ఆధారపడ్డానని, ఈ పరిస్థితుల్లో తనను నమ్ముకున్న వారికి ఏం చేయగలనని ఆయన ప్రశ్నించారు. తనను క్షమించాలని ఆయన వేడుకోవడం గమనార్హం.
గతంలో చంద్రబాబు ఇంటిమీదికి దాడికి వచ్చిన వాళ్లను అడ్డుకున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరు వచ్చారో చెప్పాలని బుద్ధా వెంకన్న ప్రశ్నించడం టీడీపీలో విభేదాల్ని బట్టబయలు చేసింది.