కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ను బీజేపీ బీ టీమ్‌గా రాహుల్ అభివర్ణించడం అధికార పార్టీకి కోపం తెప్పించింది. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమాను రాహుల్ వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాహుల్‌పై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రాహుల్ లీడర్ కాదు, రీడర్ అని మంత్రి వెటకరించడం గమనార్హం. వృద్ధులు, వితంతువులకు చేయూత పథకం కింద రూ.4 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇవ్వడాన్ని మంత్రి తప్పు పెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఎంతెంత మొత్తంలో పింఛన్ ఇస్తున్నారో లెక్కలతో మంత్రి ముందుకొచ్చారు.
నాలుగు వేలు చొప్పున పింఛన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఏ హోదాలో హామీ ఇచ్చారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నాలుగు వేల పింఛన్ ఇస్తామని ప్లకార్డును రాహుల్‌గాంధీ తెలిసి పట్టుకున్నారా? లేక తెలియక పట్టుకున్నారా? అని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇవ్వడం నిజమే అయితే, మరి ఆ పార్టీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీని కొన ఊపిరితో బతికిస్తున్న ఛత్తీస్‌గఢ్‌లో వృద్ధులు, వితంతువులకు కేవలం రూ.350, అలాగే వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ ఇస్తున్నారన్నారు. రాజస్థాన్‌లో వృద్ధులు, వితంతువులకు రూ.750, వికలాంగులకు రూ.550 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని విమర్శించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్నాటకలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రూ.800 చొప్పున పింఛన్‌ను పంపిణీ చేస్తున్నారన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4 వేలు, వితంతువులకు రూ.2,016, వృద్ధులకు రూ.2,016 చొప్పున పింఛన్‌ను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ రూ.4 వేలు ఇస్తానన్న హామీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు.