జనవరి బాక్సాఫీస్ రివ్యూ.. ఒకే ఒక్కటి

3 పెద్ద సినిమాలు రిలీజైనా ఆడేంత మార్కెట్ సంక్రాంతికి ఉంటుందంటారు. అయితే పేరుకు పెద్ద సినిమా రిలీజైతే సరిపోదు, అందులో విషయం ఉండాలి. అందుకే ఈ ఏడాది సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ఆడింది.…

3 పెద్ద సినిమాలు రిలీజైనా ఆడేంత మార్కెట్ సంక్రాంతికి ఉంటుందంటారు. అయితే పేరుకు పెద్ద సినిమా రిలీజైతే సరిపోదు, అందులో విషయం ఉండాలి. అందుకే ఈ ఏడాది సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ఆడింది. ఇంకా చెప్పాలంటే.. జనవరిలో బాగా ఆడిన సినిమా ఒక్కటే.

షకీలా బయోపిక్ తో జనవరి బాక్సాఫీస్ మొదలైంది. ఈ డబ్బింగ్ సినిమా ఫ్లాప్ అయింది. ఇక అసలైన సినిమా సందడి క్రాక్ నుంచి మొదలైంది. రవితేజ నటించిన ఈ సినిమా జనవరి 9న విడుదలై, ఈ ఏడాదికి మంచి ఆరంభాన్నిచ్చింది. రొటీన్ కథకే సరికొత్త ట్రీట్ మెంట్ ఇచ్చి రవితేజతో కలిసి హిట్ కొట్టాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

క్రాక్ తో గ్రాండ్ గా మొదలైన సంక్రాంతి సీజన్ ను మిగతా సినిమాలు కొనసాగించలేకపోయాయి. క్రాక్ తర్వాత వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. బెల్లంకొండ నటించిన ఈ ఓల్డ్ కామెడీ ఫార్ములా మూవీ ఎవ్వరికీ నచ్చలేదు. అలా సంక్రాంతికొచ్చిన అల్లుడు.. 'బెదుర్స్' అనిపించాడు.

అల్లుడు అదుర్స్ మూవీతో పాటు థియేటర్లలోకి వచ్చింది రెడ్. రామ్ నటించిన ఈ రీమేక్ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకుంది. రీమేక్ కు తనదైన మార్పుచేర్పులు చేయాలనుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు. డైలాగ్స్ మినహా మిగిలిన మార్పులన్నీ కథాబలాన్ని తగ్గించేశాయి. లుక్స్, యాక్టింగ్ పరంగా రామ్ ఆకట్టుకున్నప్పటికీ… మొత్తంగా సినిమాను నిలబెట్టలేకపోయాడు.

ఇక సంక్రాంతి బరిలో నిలిచిన మాస్టర్ మూవీ కూడా తేలిపోవడంతో.. క్రాక్ ఒక్కటే విజేతగా నిలిచింది. సంక్రాంతి హడావుడి తగ్గిన తర్వాత వచ్చాడు బంగారు బుల్లోడు. కామెడీ గ్యారెంటీ అంటూ ప్రచారం చేసిన ఈ సినిమా, థియేటర్లలో ఒక్క కామెడీ సీన్ కూడా పండించలేకపోయింది. ఓవైపు కథ-ట్విస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలో.. మరోవైపు కామెడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థంకాక మధ్యలోనే చేతులు ఎత్తేశాడు ఈ బంగారు బుల్లోడు.

ఇక జనవరి ఆఖరి వారంలో ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అన్నపూర్ణమ్మగారి మనవడు, జై సేన, కళాపోషకులు, మిస్టర్ అండ్ మిస్, చెప్పినా ఎవ్వరూ నమ్మరు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. కాస్త అంచనాల మధ్య రిలీజైన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా కూడా… 'దీన్ని భరించడం ఎలా' అంటూ ప్రేక్షకులు బాధపడేలా చేసింది. యాంకర్ ప్రదీప్ కు, హీరోగా శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది.

ఇక శ్రీకాంత్, సునీల్ లాంటి హీరోలు కలిసి చేసిన జై సేన, జనాలతో నరకం స్పెల్లింగ్ రాయించింది. మిస్టర్ అండ్ మిస్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక మిగతా సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లాయి.

ఓవరాల్ గా జనవరి బాక్సాఫీస్ లో క్రాక్ సినిమా ఒక్కటే విన్నర్ గా నిలిచింది. రెడ్ యావరేజ్ అనిపించుకోగా.. మిగతా సినిమాలన్నీ దుకాణం సర్దేశాయి. 

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా