వైసీపీ ఎంపీ మీద టీడీపీ ప్రేమ ఒలకబోతోంది. గత నాలుగేళ్ళుగా ఆయన మీద విమర్శలు చేస్తూ వచ్చిన పసుపు తమ్ముళ్ళే ఇపుడు ఆయనకు తమ ఫుల్ సపోర్ట్ అంటున్నారు. విశాఖలో భూ దందా సాగుతోందని అదే పనిగా విమర్శలు చేసిన టీడీపీకి ఇపుడు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మంచిగా కనిపించడం అంటే అది ఫక్తు పాలిటిక్స్ అంటున్నారు.
విశాఖ ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. దీని నుంచి ఎలా బయట పడాలో కూడా అర్ధం కావడంలేదు. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఎంపీకే రక్షణ లేకపోతే ఎలా అంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది.
అటు ఇటూ తిప్పి మొత్తం వైసీపీ పెద్దలకే ఈ కిడ్నాపులు దందాల వ్యవహారాన్ని ముడిపెట్టేస్తోంది. ఈ క్రమంలో తన ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఎంపీ ఇపుడు వారికి మంచి అయిపోయారు అని అంటున్నారు. ఇదంతా రాజకీయమే అని అనుకుంటున్నారు. బుద్ధా వెంకన్న లాంటి వారు ఎంపీ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తామని అంటున్నారు.
చంద్రబాబు అయితే ఎంపీని విశాఖలో వ్యాపారం చేసుకోనీయకుండా వైసీపీ ప్రభుత్వం భయపెట్టేస్తోందని, అందుకే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతాను అని అంటున్నారు అని సానుభూతి ప్రకటనలు చేస్తున్నారు. కాలికి మెడకు ఏదో విధంగా ముడిపెడుతూ టీడీపీ చేస్తున్న రాజకీయంలో వైసీపీ పెద్దలను టార్గెట్ చేయడానికి ఆ పార్టీ వారినే వాడుకోవడమే అసలైన పాలిటిక్స్ అంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కేసు విషయంలో అసలు వాస్తవాలు బయటపెట్టాలని అంతా కోరుతున్నారు.