ఇంట గెలిస్తేనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముందడుగు!

గులాబీ పార్టీ నాయకులను మినహాయిస్తే మిగిలిన పార్టీల, సామాన్య ప్రజల అభిప్రాయం మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గెలుపు కష్టమనే వినిపిస్తోంది. కేసీఆర్ పార్టీని ఓడించేది తామేనని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం…

గులాబీ పార్టీ నాయకులను మినహాయిస్తే మిగిలిన పార్టీల, సామాన్య ప్రజల అభిప్రాయం మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గెలుపు కష్టమనే వినిపిస్తోంది. కేసీఆర్ పార్టీని ఓడించేది తామేనని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ బీజేపీతో పోలిస్తే విజయావకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పే పని ఇప్పటికైతే ఆగిపోయిందనే చెప్పొచ్చు. పూర్తిగా ఆగిపోయిందని చెప్పేలేం పూర్తిగా నత్త నడక నడుస్తోంది. ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం మీదనే దృష్టి పెట్టారు. ఆయనతో సహా మంత్రులంతా తెలంగాణా దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇరవై రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

మరో విధంగా చెప్పాలంటే దీన్ని వీర భజన అని చెప్పొచ్చు. ఒకరిని ఒకరు కేసీఆర్ భజన చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి వారు చేస్తున్న భజనకు భిన్నంగా ఉంది. వరుసగా రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మూడోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు ఆయనకు సహకరించడం లేదు. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి.

ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌ ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు ఇంట గెలస్తే చాలు అన్న పరిస్థితి ఏర్పడింది. జాతీయ రాజకీయాలకు సంబంధించి దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎవరూ కేసీఆర్ ను పట్టించుకోవడంలేదు. కేసీఆర్ తన జాతీయ రాజకీయాల కల నెరవేర్చుకోవాలంటే ఆయన పార్టీ తప్పనిసరిగా రాష్ట్రంలో గెలవాలి. కానీ ఆయన పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనబడుతోంది. ఆ పార్టీ కూడా సర్వ శక్తులు ఒడ్డటానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ఎన్నికలలో ఓడిపోతే ఇక జాతీయ రాజకీయాల నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకోవాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో కేసీఆర్‌ ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలు ప్రారంభించిన కేసీఆర్.. జాతీయ అంశాలపై మాత్రం పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. విపక్ష కూటముల సమావేశాల్లో పాలు పంచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించడంలేదు. కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం సీఎం కేసీఆర్ నైజం. మీడియా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. అలాంటి కేసీఆర్ కొంతకాలం కిందట ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని తూతూ మంత్రంగా ముగించారు. పెద్దగా ఆర్భాటం కనిపించలేదు. ఏదో షోరూమ్‌ను ప్రారంభించినట్టుగా రిబ్బన్ కటింగ్‌తో కానిచ్చేశారు. కేవలం అరగంటలోనే తతంగం మొత్తం పూర్తయ్యింది.

పేరుకు జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభమే అయినప్పటికీ జాతీయ స్థాయి నాయకులు అక్కడ ఎవరూ కనిపించలేదు. పార్టీ తరపున ఎవరినీ ఆహ్వానించలేదా?.. ఎవరూ రాలేదా?.. అనే విషయంలో సమాచారం తెలియరాలేదు. కానీ కార్యక్రమం జరిగిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. చిన్నచిన్న కార్యక్రమాలకు హంగూ ఆర్భాటాలతో హడావుడి చేసే కేసీఆర్.. మరి జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఎందుకింత చప్పగా ముగించారనేది హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ జాతీయ కార్యాలయానికి జాతీయస్థాయి నేతలను ఆహ్వానించకపోవడం, మీడియాను దూరం పెట్టడమే కాదు. జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇటివల బీఆర్ఎస్ హడావుడి తగ్గినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పలు కారణాలున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ముందు.. తర్వాత సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలను కలిశారు. కొందరినీ హైదరాబాద్ పిలుపించుకొని మరీ మాట్లాడారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటకలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం, గల్వాన్ అమరవీరుల సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్ చురుగ్గా ఉన్నారనేలా కనిపించాయి.

కానీ ఈ మధ్య జాతీయ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివిటీ తగ్గినట్టు కనిపిస్తోందనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఏ పార్టీతోనూ భేటీలు, చర్చలు లేకపోవడంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి తగ్గిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కేసీఆర్ ప్రచారం చేస్తారని స్వయంగా కుమారస్వామి వెల్లడించారు. జాతీయ పార్టీ అని చెబుతున్నారు కాబట్టి వెళ్లి ప్రచారం చేయ్యొచ్చు. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తొలుత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారా? మరి జాతీయ రాజకీయాల విషయంలో బీఆర్ఎస్ నిజంగానే నెమ్మదించిందా?… లేక కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నారా? ఇదంతా కేసీఆర్ పార్టీ గెలుపోటముల మీద ఆధారపడి ఉంటుంది.