డాక్ట‌ర్ సునీత‌కు నిరాశే!

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై వివేకా కుమార్తె డాక్ట‌ర్ నర్రెడ్డి సునీత‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఈ నెలాఖ‌రులోపు వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌ను ముగించాల‌ని సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించిన సంగ‌తి…

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై వివేకా కుమార్తె డాక్ట‌ర్ నర్రెడ్డి సునీత‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఈ నెలాఖ‌రులోపు వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌ను ముగించాల‌ని సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో కీల‌క అరెస్ట్‌పై సీబీఐ దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డితో పాటు మ‌రొకరిని చివ‌రిసారిగా సీబీఐ అరెస్ట్ చేసింది.

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై పెద్ద డ్రామానే న‌డిచింది. ఇదిగో అరెస్ట్‌, అదిగో అరెస్ట్, కేంద్ర‌బ‌ల‌గాలు దిగుతున్నాయంటూ ఎల్లో మీడియా ఊద‌ర‌గొట్టింది. చివ‌రికి అరెస్ట్ జ‌ర‌గ‌కపోగా, గ‌త నెలాఖ‌రులో తెలంగాణ హైకోర్టు ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. ఎలాగైనా అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న డాక్ట‌ర్ సునీత హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ఈ పిటిష‌న్ విచార‌ణ‌లో భాగంగా సునీత‌, ఆమె త‌ర‌పు న్యాయ‌వాదిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ కేసు విచార‌ణ‌లో సీబీఐ జోక్యం చేసుకోవాల‌ని సునీత కోర‌డంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌, అలాగే ముంద‌స్తు బెయిల్‌పై సీబీఐ ఇంప్లీడ్ కావాల‌ని తామెలా చెబుతామ‌ని కామెంట్స్ చేసింది. ఈ నేప‌థ్యంలో  సుప్రీంకోర్టు ఇవాళ విచార‌ణ జ‌రిపింది.

ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు కోరుతూ సునీత వేసిన పిటిష‌న్‌పై స‌మాధానం ఇవ్వాల‌ని అవినాష్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. వ‌చ్చే నెల 3వ తేదీకి కేసు విచార‌ణ‌ను వాయిదా వేయ‌డం విశేషం. అవినాష్‌రెడ్డి వివ‌ర‌ణ‌, సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంద‌నే ఉత్కంఠ‌కు తెర‌లేచింది.