రాహుల్‌కు ష‌ర్మిల శుభాకాంక్ష‌లు…విలీనంపై మ‌ళ్లీ!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీకి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోనియాగాంధీ కుటుంబాన్ని వైఎస్ జ‌గ‌న్ కుటుంబం బ‌ద్ధ శ‌త్రువుగా చూస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మ…

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీకి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోనియాగాంధీ కుటుంబాన్ని వైఎస్ జ‌గ‌న్ కుటుంబం బ‌ద్ధ శ‌త్రువుగా చూస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మ కేసులు పెట్టి, 16 నెల‌ల పాటు జైలుకు పంపింద‌ని వైఎస్ కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోనియాను వ్య‌తిరేకించి, కాంగ్రెస్ నుంచి బ‌య‌టికొచ్చిన వైఎస్ జ‌గ‌న్ సొంత పార్టీని పెట్టుకున్నారు. వైఎస్ జ‌గ‌న్ దెబ్బ‌తో కాంగ్రెస్ పార్టీ ఏపీలో మ‌ట్టి కొట్టుకుపోయింది.

కాంగ్రెస్ పేరు వింటే చాలు, వైఎస్ జ‌గ‌న్ అనుచ‌రులు మండిప‌డ‌తారు. ఈ నేప‌థ్యంలో రాహుల్‌కు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల ట్విట‌ర్ వేదిక‌గా రాహుల్‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్ టీపీని విలీనం చేస్తార‌ని గ‌త కొంత కాలంగా విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారాన్ని ష‌ర్మిల కొట్టి పారేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ష‌ర్మిల ఎలాంటి రాజ‌కీయ కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డం లేదు.

కేవ‌లం సోష‌ల్ మీడియా పోస్టుల వ‌ర‌కే ప‌రిమిత‌మై, ఆమె రిలాక్ష్ అయ్యార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ష‌ర్మిల తిర‌గ‌డంపై కేసీఆర్ స‌ర్కార్ అడుగ‌డుగునా ఆంక్ష‌లు విధించింది. ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్ల‌లేని ప‌రిస్థితి. మ‌రోవైపు ఆర్థికంగా ష‌ర్మిల ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. పార్టీని న‌డ‌ప‌డం ఆమెకు భారంగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె చూపు కాంగ్రెస్ వైపు చూస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌ర్నాట‌క మంత్రి డీకే శివ‌కుమార్‌తో ష‌ర్మిల వ‌రుస భేటీలు ఈ ప్ర‌చారానికి బ‌లం క‌లిగిస్తున్నాయి. తాజాగా రాహుల్‌కు ష‌ర్మిల పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నాయి. రాహుల్ ఇలాగే ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో నిత్యం ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తినిస్తూ సేవ చేస్తూ వుండాల‌ని ష‌ర్మిల కోరుకున్నారు. అలాగే ఆరోగ్యంతో, సుఖ‌సంతోషాల‌తో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా అని ష‌ర్మిల అన‌డం వెనుక‌… సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్త‌ప‌రిచార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ష‌ర్మిల ఊరికే రాహుల్‌గాంధీకి బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌లేద‌ని, దీని వెనుక రాజ‌కీయం ఉంద‌నే ప్ర‌చారాన్ని కొట్టి పారేయ‌లేని పరిస్థితి.