పవన్‌పై నమ్మకం వదులుకున్న కీలక అభ్యర్థి!

పవన్ కల్యాణ్ ఒక వైపు ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోనని ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తూనే ఉన్నారు. పొత్తుల సంగతి ఇంకా క్లారిటీ రాలేదని అంటుంటారుగానీ, వచ్చే…

పవన్ కల్యాణ్ ఒక వైపు ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోనని ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తూనే ఉన్నారు. పొత్తుల సంగతి ఇంకా క్లారిటీ రాలేదని అంటుంటారుగానీ, వచ్చే ఎన్నికల తర్వాత తాను సీఎం అయిపోతానని మాత్రం చెబుతుంటారు. 

తమ పార్టీ అభ్యర్థులంతా ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభలో అడుగుపెట్టి తీరుతారని కూడా ఆయన భరోసా ఇచ్చే మాటలు పలుకుతున్నారు. కానీ.. పవన్ కల్యాణ్ తరఫున గత ఎన్నికల్లో కీలక నియోజకవర్గం నుంచి పోటీచేసిన కీలక అభ్యర్థి మాత్రం.. పవన్ చెబుతున్న ప్రగల్భాలను నమ్మడం లేదు. పవన్ వెంట ఉండడం కంటే, చిన్నదో పెద్దదో, తానే సొంత పార్టీని పెట్టుకోవడమే మేలని డిసైడ్ అయ్యారు. తాజాగా విజయవాడలో సొంత పార్టీని ప్రకటించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున గత 2019 ఎన్నికల్లో బోడె రామచంద్రయాదవ్ పోటీచేశారు. అక్కడి వైసీపీ అభ్యర్తి, బలమైన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన గట్టిగానే తొడకొట్టారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి అనేషా రెడ్డికి 63 వేల ఓట్లు వస్తే, రామచంద్ర యాదవ్ కు 16వేలకు పైగా ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా దక్కిన సగటు ఓటు శాతం 6 అయితే, పుంగనూరులో రామచంద్రయాదవ్ కు వచ్చిన ఓటు శాతం 8.4! ఆ రకంగా ఆ పార్టీకి ఆయన బలమైన నాయకుడే.

ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులైనా కాడిపక్కన పడేశారు గానీ.. బోడె రామచంద్రయాదవ్.. పెద్దిరెడ్డి మీద అలుపెరగని యుద్ధం ప్రకటించారు. పెద్దిరెడ్డి మీద తరచూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజాఉద్యమాలు చేయడం చేస్తుండేవాడు. పెద్దిరెడ్డిని ఈ ఉద్యమాలతో తరచూ చికాకు పెట్టేవాడు. ఆయన పోరాటాల్ని పెద్దిరెడ్ది కూడా సీరియస్ గా తీసుకున్నారు. అనేక సందర్భాల్లో రామచంద్రయాదవ్ ను హౌస్ అరెస్టు చేయించడం, ప్రకటించిన ఆందోళన కార్యక్రమాల్లో హాజరు కాకుండా అడ్డుకోవడం చేసేవారు. ఆ రకంగా పెద్దిరెడ్డికి ఆయన బలమైన ప్రత్యర్థిగానే తయారయ్యారు.

అయితే సదరు రామచంద్రయాదవ్ కు పవన్ కల్యాణ్ మీద నమ్మకం పోయినట్టుగా ఉంది. అవినీతి రహిత పాలన అందించడం లక్ష్యంగా సరికొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. జులై 23వ తేదీన కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని, నాగార్జున యూనివర్సిటీ ఎదుట ప్రజా సింహగర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి పార్టీ పేరును ప్రకటిస్తానని అంటున్నరు. 

పవన్ ఒకవైపు జగన్ ను ఓడిస్తానని తన పార్టీ గెలుస్తుందని, తాను సీఎం అవుతానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ గత ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున పోటీచేసిన కీలక అభ్యర్థులు కూడా ఆ మాటలు నమ్మడం లేదు. కాస్త గట్టి కేండిడేట్లు ఎవరికి వారు సొంత దారులు చూసుకుంటున్నారు. తీరా ఎన్నికల వేళకు పవన్ పార్టీకి అభ్యర్థులుగా పసలేని సొల్లు నాయకులే మిగులుతారేమో అని పలువురు అంచనా వేస్తున్నారు.