పవన్ కు ఆ ధైర్యం లేదా? అహంకారమా?

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విచ్చలవిడిగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  Advertisement అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ…

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విచ్చలవిడిగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రానివ్వను అని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ప్రత్యేకించి.. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకూడదని, అ రకంగా వారిని ఓడించాలని పవన్ కల్యాణ్  పిలుపు ఇచ్చారు. తనను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని, తనకు ప్రాణగండం ఉందనే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. 

ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పవన్ ఒక్క పని మాత్రం చేయలేకపోతున్నారు. అందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదో, లేదా, ఆయన లోని మితిమీరిన అహంకారం ఆయనతో ఆ పని చేయనివ్వడం లేదో అర్థం కావడం లేదు.

సాధారణంగా రాజకీయ నాయకులు ఎవ్వరైనా సరే ప్రజల్లో పర్యటిస్తున్నప్పుడు.. తమ పార్టీ స్థానిక నాయకులను కూడా ప్రజల ఎదుట ఎలివేట్ చేయాలని అనుకుంటారు. బహిరంగ సభల్లో గానీ వాహనాల మీదనుంచి గానీ ప్రసంగించేప్పుడు.. స్థానిక నాయకులు ఒకరిద్దరిని తమ పక్కన నిల్చోబెట్టుకుంటారు. తమ సభకు హాజరైన జనం ముందు తమ స్థానిక నాయకులు ఎలివేట్ కావాలని కోరుకుంటారు.

కానీ పవన్ కల్యాణ్ వారాహి యాత్రను గమనించిన వారికి అలాంటి పోకడ ఏమీ కనిపించదు. వారాహి వాహనం మీదనుంచి పవన్ కల్యాణ్ ఒక్కరే నిల్చుని మాట్లాడతారు. తొలిరోజు అయితే పూర్తిగా ఆయన ఒక్కడే! ప్రాణాపాయం గురించిన భయాలను ప్రకటించిన తర్వాత.. తన వెనుక సెక్యూరిటీ వారిని కూడా నిల్చోబెట్టుకుంటున్నారు. అయితే స్థానిక నాయకుల్ని ఎందుకు నిల్చోబెట్టుకోవడం లేదు.

ఇందుకు రకరకాల కారణాలున్నాయి. జనసేన పార్టీకి రాష్ట్రంలో మూడో నాయకుడికి దిక్కు లేదు. ఉన్నది ఇద్దరే. స్థానిక నాయకుడిని పక్కన పెట్టుకుంటే.. వారిని అక్కడి నుంచి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పకపోయినా సరే ప్రజల్లోకి ఒక సందేశం వెళుతుంది. అలాంటి ప్రాధాన్యాన్ని నియోజకవర్గాల్లోని ఏ నాయకుడికి కూడా ఇవ్వడానికి పవన్ కు ఇష్టం లేదు. పార్టీలో తానొక్కడే నాయకుడిగా వెలగాలని, మరొకరెవ్వరూ నాయకుడు అనే స్థాయిలో ఉండరాదని ఆయన అహంకారం ప్రేరేపిస్తుంది. 

తాను ఎవరినైనా అభ్యర్థిగా ఎలివేట్ చేస్తే, లేదా, లోకల్ లీడర్లకు ప్రయారిటీ ఇచ్చి పక్కన పెట్టుకుంటే.. వారు ఆ ప్రయారిటీని వాడుకుని అధికార వైసీపీలోకి జంప్ చేసేస్తారేమో అని పవన్ కు భయం కూడా. పార్టీలోని నాయకులందరూ తన మీద విశ్వాసంతో, నమ్మకంతో కొనసాగుతున్నారనే అభిప్రాయం ఆయనకే లేదు. అందుకే అనేక రకాల సంశయాల్లో బతుకుతుంటారు.

కానీ ఇలాంటి చవకబారు ఆలోచన వల్ల పార్టీ ఎప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వం అసలే లేని అనాథ పార్టీగా తయారవుతుందని, అలా జరిగితే అది తన స్వయంకృతాపరాధం అవుతుందని పవన్ ఎప్పటికి తెలుసుకుంటారో మరి!