బ్రదర్ అనిల్‌కుమార్ సోమవారం విశాఖలో చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మూడ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వాస్తవాన్ని వైసీపీ శ్రేణులు గ్రహించాలి, జీర్ణించుకోవాలి. మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి కానివ్వదని పవన్‌కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ, వామపక్ష నేతలు అనుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్లంతా వైసీపీ ప్రత్యర్థులే కాబట్టి.
కానీ బ్రదర్ అనిల్‌కుమార్ అలా కాదు కదా! జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల భర్త. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయాన అల్లుడు. పైగా గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును అధికారం నుంచి దించేసేందుకు వైఎస్ షర్మిల ‘బై బై బాబు, బైబై పప్పు ’ అనే నినాదంతో ఊరూరూ ప్రచారం చేస్తూ, జనంలో వైసీపీపై సానుకూలతను సృష్టించారు. అన్న కోసం 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణంగా తనను తాను అభివర్ణించుకున్నారు.
అన్నంటే ప్రాణమని చెప్పే చెల్లి తెలంగాణ వెళ్లి సొంత రాజకీయ కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడామె భర్త అనిల్‌కుమార్ విశాఖకు వచ్చి వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలతో సమావేశం కావడమే ఓ సంచలనం. ఇక ఆ సమావేశంలోనూ, అనంతరం మీడియాతోనూ బ్రదర్ అనిల్‌కుమార్ చేసిన కామెంట్స్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం.
బ్రదర్ అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్‌ను ప్రధానంగా వైసీపీ పరిగణలోకి తీసుకోవాల్సి వుంది. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని పలు సంఘాల నాయకులు తనను కోరారని, వారి ప్రతిపాదనను కచ్చితంగా సమర్థించి, మద్దతు ఇస్తానని బ్రదర్ అనిల్ ప్రకటించడాన్ని వైసీపీ సీరియస్‌గా తీసుకోవాలి. చివరికి బామ్మర్దికి వ్యతిరేకంగా మరొక కూటమికి మద్దతు ఇచ్చేందుకు బ్రదర్ అనిల్ సిద్ధం కావడం… ఆంధ్రప్రదేశ్ రాజకీయ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
జగన్ రెండున్నరేళ్ల పాలన ఏం సాధించిందో బ్రదర్ అనిల్ వ్యాఖ్యలను బట్టి వైసీపీ పెద్దలు అర్థం చేసుకోవచ్చు. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను బ్రదర్ అనిల్ కామెంట్స్ తెలియజేస్తున్నాయి. బ్రదర్ అనిల్ కామెంట్స్‌ను హెచ్చరికగా తీసుకోకుంటే రాబోవు రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని వైసీపీ గుర్తెరగాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.