గంటా వేడుకోలు : తెరవెనుక పెద్దకథే ఉందా?

అచ్చంగా స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా చేసేసిన తర్వాత.. దానిని ఆమోదించడం అనేది స్పీకరు బాధ్యత. కానీ.. నన్ను పదవిలోంచి పీకేసి ఇంటికి అర్జంటుగా పంపేయండని బతిమాలేంత పరిస్థితి ఎందుకొచ్చింది? ఎటూ ఆయన ఎమ్మెల్యేగా…

అచ్చంగా స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా చేసేసిన తర్వాత.. దానిని ఆమోదించడం అనేది స్పీకరు బాధ్యత. కానీ.. నన్ను పదవిలోంచి పీకేసి ఇంటికి అర్జంటుగా పంపేయండని బతిమాలేంత పరిస్థితి ఎందుకొచ్చింది? ఎటూ ఆయన ఎమ్మెల్యేగా గానీ, తెలుగుదేశం నాయకుడిగా గానీ యాక్టివ్ గా లేరు. 

ఇక ఎమ్మెల్యే పదవి ఉంటే ఏంటి? పోతే ఏంటి? అనే సందేహాలు కలగడం సహజం. అయితే.. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అడుగులు వేయడానికి ఈ ఎమ్మెల్యే పదవి అడ్డంగా ఉన్నందునే రాజీనామాకు సిద్దపడినట్లుగా, ఆ రాజీనామా ఆమోదానికి తొందరపడుతున్నట్లుగా వినిపిస్తోంది. 

విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ పట్ల నిరసన లాంటివన్నీ.. ఏదో పైపై మాటలు మాత్రమే అనే వాదన వినిపిస్తోంది. తెలుగుదేశం సర్వభ్రష్టత్వం చెందిన తర్వాత.. గంటా ముందుగానే మేలుకున్నారు. ఆ పార్టీనుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు. 

చంద్రబాబునాయుడును ఖాతరు చేయడం కూడా మానేశారు. ఆయన పిలిచినా వెళ్లరు. తనంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు.. అలా ఉంది పరిస్థితి. అయితే చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేల్లాగా.. ఎమ్మెల్యే పదవిని వదులుకోకుండా, అధికారికంగా కండువా కప్పుకోకుండా వైసీపీ పట్ల ప్రేమతో మెలిగే ఆలోచన కూడా చేశారు గానీ.. ఆయన శత్రువు అవంతి శ్రీనివాస్ పడనివ్వలేదు. 

విజయసాయిరెడ్డి గంటాను పార్టీలోకి తేవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే గంటా బిజెపి వెళ్తారని పెద్ద ప్రచారమే జరిగింది. తాజాగా తన స్పీకర్ ఫార్మాట్ రాజీనామాకు కారణం.. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు నిరసన అని గంటా కొత్త బుకాయింపు వినిపిస్తున్నారు గనుక.. బిజెపిలోకి వెళ్లే తలుపులు ఎప్పుడో మూసుకుపోయినట్లే అనుకోవచ్చు. మరి ఆయన ప్రణాళిక ఏంటి? ఎందుకింత పదవి వదులుకునే తొందర!

అయితే ఆయన ఏపీలో సరికొత్త కాపురాజకీయ శక్తికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. కాపు ప్రముఖులందరినీ పోగేసి.. ఇప్పటికే రెండుసార్లు అటు హైదరాబాదులోను, ఇటు విశాఖలోను విందు భేటీలు కూడా నిర్వహించి.. కాపు రాజకీయ శక్తి ఆవిర్భావం గురించి తన వంతు వ్యూహరచన చేసినట్లుగా ప్రచారం ఉంది. 

ఆ కాపు రాజకీయ శక్తి ఆవిర్భావ పనులను అధికారికంగా ప్రారంభించేందుకే ఇప్పుడు ఉన్న పదవిని వదులుకునే స్వేచ్ఛగా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. 

మరి గంటా కొత్త కాపు రాజకీయ శక్తిని తీసుకువస్తారా.. దానిని ఏదైనా ఒక పార్టీకి అనుబంధంగా నడుపుతారా? ఆయన కొత్త రాజకీయ శక్తి తెస్తే.. కాపు ఓట్లనే నమ్ముకున్న పవన్ కల్యాణ్ ఏమైపోవాలి? అనేవి ప్రశ్నలే!!