ఎన్నికల సీజన్ మొదలైంది. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికలు వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలు ఆ పార్టీల భవిష్యత్‌పై ఆధారపడి ఉన్నాయి. అధికారంలోకి రాకపోతే ఉనికికే ప్రమాదం అనే భయం ఇరు పార్టీల అగ్రనేతల్లో వుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరోసారి విజయం సాధించేందుకు పోల్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకమని భావిస్తోంది.
ఇందుకు అధికారుల సహకారం ఎంతో అవసరమని వైసీపీ నమ్ముతోంది. ముఖ్యంగా పోలీస్ అధికారుల పాత్ర కీలకంగా వుండడంతో , తమకు నమ్మకమైన వారి కోసం అధికార పార్టీ వెతుకుతోంది. పోలీసు స్థాయి మొదలుకుని ఎస్పీ వరకూ తమకు అనుకూలంగా పని చేసే వారిని నియమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వైసీపీ అనుకూల, వ్యతిరేక పోలీసులు ఎవరెవరు అని అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
తమకు నమ్మకమైన పోలీస్ అధికారి ఏ ప్రాంతంలో ఉన్న తెచ్చుకోడానికి ఎమ్మెల్యేలు వెనుకాడడం లేదు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని తమకు నమ్మకమైన వారిని పిలిపించుకుని… మన అనుకునే వారెవరు? కాని వారెవరో తెలుసుకునే ప్రయత్నాల్ని మొదలు పెట్టారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న అధికారులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చర్చిస్తున్నారు.
ఈ దఫా ఎన్నికలు హోరాహోరీని తలపిస్తాయని, కాస్తా తెగించి పని చేయాల్సి వుంటుందని ముందే చెబుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే… ఒక్కొక్కరి అంతు తేలుస్తామంటూ పోలీస్ అధికారులను చంద్రబాబు, లోకేశ్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముంగిట పోలీస్ అధికారుల నియామకం చర్చనీయాంశమైంది.