సైకో పోవాలి…సైకో పాల‌న కావాలా?

టీడీపీ మేనిఫెస్టో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. మ‌హానాడులో టీడీపీ మొద‌టి విడ‌త మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది. ద‌స‌రాకు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. టీడీపీ మేనిఫెస్టోలో సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద పీట వేయ‌డంతో వైసీపీ కౌంట‌ర్…

టీడీపీ మేనిఫెస్టో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. మ‌హానాడులో టీడీపీ మొద‌టి విడ‌త మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది. ద‌స‌రాకు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. టీడీపీ మేనిఫెస్టోలో సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద పీట వేయ‌డంతో వైసీపీ కౌంట‌ర్ ఎటాక్ చేస్తోంది. 

ఇంత కాలం జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను తీవ్రంగా విమ‌ర్శించి, ఇప్పుడు త‌మ దారిలోకే టీడీపీ రావ‌డం ఏంట‌ని వైసీపీ ఎదురు దాడికి దిగింది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై టీడీపీ నినాదాన్ని తీసుకుని, తీవ్ర‌స్థాయిలో వైసీపీ కౌంట‌ర్ ఇస్తోంది. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ జ‌గ‌న్‌ను ఉద్దేశించి టీడీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

సైకో పోవాలి, సైకో పాల‌న కావాలా? నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వ‌శాలి అయిన చంద్ర‌బాబు త‌న అనుభ‌వమంత వ‌య‌సున్న జ‌గ‌న్‌ను అనుస‌రించాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని, రాష్ట్రానికి, టీడీపీకి ఇదేం ఖ‌ర్మ అంటూ వైసీపీ ఓ రేంజ్‌లో చిత‌క్కొడుతోంది.

ఇంత కాలం ఎన్టీఆర్ పాల‌న తీసుకొస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఇప్పుడు త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ పాల‌న తెస్తాన‌ని సంక్షేమ ప‌థ‌కాలు సైతం ప్ర‌క‌టించార‌ని, ఇదీ వైసీపీ మొద‌టి విజ‌యం అంటూ వారు వెట‌క‌రిస్తున్నారు. 

జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను తిట్టిన నోటితోనే, అవే అమ‌లు చేస్తామ‌ని ఏకంగా మేనిఫెస్టో ప్ర‌క‌టించేలా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబును త‌న దారికి తెచ్చుకోవ‌డ‌మే  నాలుగేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ సాధించిన విజ‌యంగా వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్న‌ట్టుగా జ‌గ‌న్ సైకో అయితే, మ‌రి ఆయ‌న అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌నే తాము కూడా కొన‌సాగిస్తామ‌ని చంద్ర‌బాబు, లోకేశ్ ఎందుకు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 

క‌నీసం సొంతంగా ఒక సంక్షేమ ప‌థ‌కానికి కూడా రూపం తీసుకురాలేని చంద్ర‌బాబు, సంప‌ద సృష్టించి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తారంటే జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని దెప్పి పొడుస్తున్నారు. 

ప్ర‌త్య‌ర్థి పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టి అధికారంలోకి రావాల‌ని త‌పించే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఉండ‌డం రాష్ట్రానికి ఖ‌ర్మ కాక‌పోతే మ‌రేంట‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.