చిన్న దొరా అంటూ ష‌ర్మిల నిల‌దీత‌!

చిన్న దొరా అంటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను వైసీపీటీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల నిల‌దీస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. తెలంగాణ కంటే మంచి ప‌థ‌కాలు చూపిస్తే… రాజీనామా చేస్తాన‌ని మంత్రి కేటీఆర్ స‌వాల్ విస‌ర‌డం…

చిన్న దొరా అంటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను వైసీపీటీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల నిల‌దీస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. తెలంగాణ కంటే మంచి ప‌థ‌కాలు చూపిస్తే… రాజీనామా చేస్తాన‌ని మంత్రి కేటీఆర్ స‌వాల్ విస‌ర‌డం ష‌ర్మిల ఆగ్ర‌హానికి, నిల‌దీత‌కు కార‌ణ‌మైంది. కేటీఆర్ స‌వాల్‌కు సంబంధించి పేప‌ర్ క్లిప్పింగ్‌ను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ, ప్ర‌శ్న‌ల‌ను సంధించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  

“రుణమాఫీ చెయ్యడం లేదని రాజీనామా చేస్తారా?

రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా? నష్టపోయిన రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తలేరని రాజీనామా చేస్తారా? రైతు బీమా రైతులందరికి అందిస్తలేరని రాజీనామా చేస్తారా? కౌలు రైతును రైతుగానే  గుర్తిస్తలేరని రాజీనామా చేస్తారా? నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, యువతను నిరుద్యోగానికి బలిచేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అని మాట ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నందుకు రాజీనామా చేస్తారా?”  అని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికార పార్టీ ముఖ్య నేత‌ను నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే…

“పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? పేద విధ్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరని రాజీనామా చేస్తారా? మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? మీరు సల్లంగుండాలి. రాష్ట్రం రావణకాష్టం కావాలి. అంతే కదా మీ అద్భుత పాలన” అని త‌న మార్క్ వ్యంగ్యాస్త్రాల‌తో కేటీఆర్‌ను దెప్పి పొడిచారు.

అయితే ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై తెలంగాణ‌లో ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో అస‌లు ఆమె ఉనికిని గుర్తించ‌డానికి కూడా ఇటు అధికార‌, అటు ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా సిద్ధంగా లేక‌పోవ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో త‌న ఉనికిని ష‌ర్మిల చాటుకోవ‌డం ఎలా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.